Mallaiah Yadav On Byelections: తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకు మరింత పెరుగుతోంది. జూబ్లిహిల్స్ ఎన్నిక కొనసాగుతున్న వేళ బీఆర్‌ఎస్ నేత బొల్లం మల్లయ్య కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల ప్రక్రియను మలినం చేస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతోందని, ప్రజల ఓటును నోట్ల కట్టలతో కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
ఎక్కడ చూసినా డబ్బులు పంచుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని.. కాంగ్రెస్ నేతలు నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు మల్లయ్య. తమ అభ్యర్థికి బలవంతంగా ఓటు వేయించే విధంగా ప్రలోభాలు చూపిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఈసీ కూడా సరైన చర్యలు చేపట్టడం లేదని.. తమ ఫిర్యాదుపై తగిన చర్యలు లేవని అన్నారు. ఇదే సమయంలో పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. బూటకపు పథకాలతో పాటు, డబ్బు ప్రలోభాలను ఉపయోగించి ఓటర్లపై ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బీర్ల ఐలయ్య ,రామచంద్ర నాయక్ ,శంకర్ నాయక్ , అమిత్ రెడ్డి లాంటి నేతలు నిబంధనలు ఉల్లంఘించిన రెడ్ హ్యాండెడ్ దొరికిపోయారని మాజీ ఎమ్మేల్యే మల్లయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే అధికార పార్టీ ఓటర్లను భయాందోళనలకు గురిచేస్తోందని అన్నారు. పొద్దున నుంచి ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న తప్పులపై 60 వరకు ఫిర్యాదులు మెయిల్ ద్వారా పంపామని, నేరుగా కూడా అధికారులను దీనిపై కలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ గూండాయిజానికి ప్రజలు భయపడరని.. తమ ఓటుతోనే సమాధానం చెబుతారని అన్నారు మల్లయ్య.
మల్లయ్య ఎన్నికల సంఘాన్ని వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలని, ఉపఎన్నిక సజావుగా జరిగేలా ఎన్నికల కమిషన్ చూడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల అనుచిత చర్యలపై విచారణ జరిపి, డబ్బు పంపిణీని అడ్డుకోవాలని ఆయన కోరారు. మరోపక్క రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాలు మాత్రం ఈ ఆరోపణలపై నివేదిక కోరినట్లు తెలిసింది. మెుత్తానికి ఎన్నికల రోజున బీఆర్‌ఎస్–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరం అయ్యిందని చెప్పుకోవచ్చు.


