CM Revanth Reddy- Ajay Devgn: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఓవైపు రాష్ట్రానికి ముఖ్యమైన ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులను కలుస్తూనే.. మరోవైపు రాష్ట్రాభివృద్ధి కోసం సినీ, క్రీడా ప్రముఖులతో కూడా భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై ఆసక్తి కనబరిచారు.
సినీ నిర్మాణంలో కీలకమైన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇతర అత్యాధునిక అంతర్జాతీయ సదుపాయాలతో కూడిన స్టూడియో నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు. అలాగే వివిధ విభాగాలకు అవసరమైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను సీఎంకు సమర్పించారు.

అంతేకాకుండా తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాలకు అంబాసిడర్‌గా ఉంటానని తెలిపారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణలో సినిమా రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి రేవంత్ రెడ్డి ఆయనకు వివరించారు. ఇక ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే తెలుగు సినీ పరిశ్రమ రూపరేఖలు మారిపోతాయని.. స్థానిక కళాకారులు, నిపుణులు మంచి అవకాశాలు లభిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు ప్రతిరూపమైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీకి ఈ భేటీ కీలక ముందుడుగు అని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం విశేషం. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు తెలంగాణను క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలను సీఎం వివరించారు. దీంతో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తాను భాగస్వామంగా ఉండేందుకు కపిల్ సుముఖత వ్యక్తం చేశారు.



