Boreddy Ayodhya Reddy| తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శలు గుప్పిస్తుంటే.. కేటీఆర్ విమర్శలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పీఆర్వో(PRO) బోరెడ్డి అయోధ్యరెడ్డి(Boreddy Ayodhya Reddy) కేటీఆర్ తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు అధికారం నుంచి దించినా కేటీఆర్ తీరులో ఎలాంటి మార్పు లేదని దుయ్యబెట్టారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
“ఇంకా అదే అహంకారం.. అంతే అహంభావం. కేటీఆర్ మారడు, మారలేడు… ఇప్పటికీ అరగెన్స్… అoతే ఆటిట్యూడ్… ఎందుకు జర్నలిస్టుల మీద ఈ అక్కసు ఈయనకు?. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల నుంచి, ప్రెస్‌మీట్లలో వెక్కిరింపుల దాకా ప్రతిచోటా జర్నలిస్టులకు అవమానాలే. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి జర్నలిస్టులంటే అదే చులకనభావం. తెలంగాణ ప్రజలు అధికారం నుండి ఆ పార్టీని దించినా కేటీఆర్‌లో ఏమాత్రం తగ్గని గర్వం.. ఇంకా పెరిగిన అహంకారం. 10 ఏండ్లు అధికారంలో ఉన్నంతకాలం జర్నలిస్టులను కనీసం మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు” అని ధ్వజమెత్తారు.
“నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, వైయస్సార్ ఇచ్చిన ఇండ్ల జాగాలు స్వాధీనం చేయడానికి మనసొప్పలేదు. ఆ సైటును నీ దోస్తులకు ఇవ్వాలని చూశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను సియోల్ నగరం తీసుకెళ్తే… వ్యంగ్యంగా వ్యాఖ్యానించి మరోసారి మీ తలబిరుసుతనం చూపించడం సహేతుకమా? నీ దగ్గర విజ్ఞత, గౌరవం ఆశించడం అత్యాశేనని నీ అహంకారాన్ని మరోసారి నిరూపిస్తోంది” అని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా మూసీ ప్రక్షాళన కోసం దక్షిణకొరియా రాజధాని అయిన సియోల్ నగరంలోని కాల్వ సుందరీకరణను పరిశీలించడానికి మంత్రుల బృందం వెళ్లింది. వీరితో పాటు కొంతమంది జర్నలిస్టులను తీసుకెళ్లారు. దీంతో జర్నలిస్టులు వెళ్లడంపై కేటీఆర్ విమర్శలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ జర్నలిస్టులను తానేమి అవమానించలేదంటూ కేటీఆర్ స్పష్టంచేశారు.