Wednesday, July 16, 2025
HomeతెలంగాణBlack Magic: వామ్మో విడాకుల కోసం చేతబడి.. చివరికి ఏం జరిగిందటే

Black Magic: వామ్మో విడాకుల కోసం చేతబడి.. చివరికి ఏం జరిగిందటే

ఈ మధ్య కాలంలో వివాహ బంధం అంటేనే భయమేసే పరిస్థితులు నెలకొన్నాయి. భార్యను భర్త హత్య చేయడం, భర్తను భార్య హత్య చేయడం వంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అయితే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో విడాకుల విషయంలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా విడాకులు తీసుకోవాలంటే చట్టపరమైన ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కుటుంబ సభ్యులు ఊహించని మార్గాన్ని ఎంచుకున్నారు. అదే క్షుద్రపూజలు. క్షుద్రపూజల ద్వారా భార్య భర్తలను దూరం చేయాలని ప్లాన్ వేశారు. దానికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

కామారెడ్డి జిల్లా రాజ్‌ఖాన్‌పేటకు చెందిన తాళ్లపల్లి ఆశ్రిత, వెంకటాపూర్‌కు చెందిన రాగుల హరిచరణ్‌కు గతంలో వివాహం జరిగింది. వారి దాంపత్య జీవితం సాధారణంగా కొనసాగుతోంది. ఎటువంటి పెద్ద గొడవలు లేకుండా, అన్యోన్యంగా వారు జీవిస్తున్నారు. అయితే, ఆశ్రిత కుటుంబం ఆర్థికంగా తీవ్రమైన సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక భారాన్ని తీర్చేందుకు, అలాగే హరిచరణ్‌కు ఇచ్చిన కట్నం డబ్బులను తిరిగి పొందేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఆశ్రితకు విడాకులు ఇప్పించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఆశ్రిత మాత్రం విడాకులకు అంగీకరించలేదు. దీంతో, కుటుంబ సభ్యులు ఒక క్షుద్రపూజారి సహాయాన్ని ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో, “హరిచరణ్‌ను బెదిరించాలా? ప్రాణం తీసేయాలా?” అన్నట్లుగా క్షుద్రపూజారి మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. ఈ మాటలు విన్న హరిచరణ్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఆయన భార్య ఆశ్రితతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. “మాకు ప్రాణహాని ఉంది, వెంటనే చర్యలు తీసుకోండి” అంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లయింట్ ఇచ్చారు. ఈ అంశంపై స్పందించిన ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రాల్‌రెడ్డి మాట్లాడుతూ, ఘటనపై ఫిర్యాదు అందినట్లు, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విడాకుల కోసం క్షుద్రపూజల వంటి పని చేయడం ఇప్పటివరకు చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది. అయితే ఈ సంఘటన మరీ దారుణమైనది కావడంతో సామాజికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. “వివాహ బంధాన్ని ఈ రీతిగా దుర్వినియోగించడమేంటి?”, “ఆర్థిక లాభాల కోసం ఇంత నీచమైన స్థాయికి దిగజారడం సరైనదేనా?” అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇదంతా తెలుసుకున్న దంపతులు బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్నట్లు తెలిపారు. వారి భద్రతకు సంబంధించి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News