BJP-TDP-BRS: తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మంలో తలపెట్టిన సభ సక్సెస్ అయినట్లే చెప్పుకోవాలి. పేరున్న నాయకుడు లేకుండా.. క్యాడర్ లేకుండా ఈ స్థాయిలో జనసమీకరణ అంటే సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. దానికోసం ఎవరు ఏ తిప్పలు పడ్డారన్నది పక్కనపెడితే టీడీపీలో ఎంతో కొంత జోష్ అయితే కనిపించింది. ఇక, టీడీపీ సభ ముగిసిందో లేదో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబుపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. బీజేపీకి మేలు చేసేందుకే చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో అడుగుపెట్టాడని కామెంట్లు చేశారు.
అయితే.. అసలు రాష్ట్రంలో యాక్టివ్ లేని టీడీపీపై బీఆర్ఎస్ మంత్రులు ఈ స్థాయిలో విమర్శలు ఏంటా అంటే.. దాని వెనక పెద్ద పెద్ద కారణాలే కనిపిస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ నువ్వా నేనా అన్నట్లు తలపడుతుండేవి. ఇప్పుడు కాంగ్రెస్ సానుభూతిపరులను షర్మిల వైఎస్ఆర్టీపీ ఆకట్టుకోవాలని చూస్తుంటే.. టీడీపీ సానుభూతిపరులు ఎప్పుడో టీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్లిపోయారు. తెలంగాణ టీడీపీ సీనియర్లు టీఆర్ఎస్ లో చేరడం కిందిస్థాయి వాళ్ళని ఆకర్షించడం.. టీడీపీ తెలంగాణలో కార్యకలాపాలకి దూరమవడంతో టీడీపీ అభిమానులు, సానుభూతిపరులు టీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్లిపోయారు. అయితే.. వీళ్లంతా టీడీపీ మీద వ్యతిరేకతతో టీఆర్ఎస్ వైపు వెళ్ళలేదు. పార్టీ యాక్టివ్ లేకపోవడంతో కేసీఆర్ సైన్యంతో కలిశారు.
అయితే ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో టీడీపీ యాక్టివ్ గా మారితే అది బీఆర్ఎస్ పార్టీకి దెబ్బకొట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకే తాజాగా చంద్రబాబు ఖమ్మం సభ అనంతరం టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబుపై తీవ్ర విమర్శలకు దిగారు. తెలంగాణలో టీడీపీ మళ్ళీ ఎంతోకొంత ఓటింగ్ తెచ్చుకోగలిగే స్థాయికి నిర్మాణం జరిగితే బీజేపీ స్నేహం చేయడం ఖాయం. ఆంధ్రాతో పోల్చితే బీజేపీకి తెలంగాణలో బలపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే.. ఆ అవకాశాలు ఇప్పటికిప్పుడు అధికారం తెచ్చిపెట్టే స్థాయిలో లేవు. కనుక ఒకటి రెండు శాతం ఓటింగ్ వస్తుందని భావించినా టీడీపీని కలుపుకొని పోవడం పక్కా. గత ఎన్నికలలో తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ తో కలిసి పోటీచేస్తే.. ఆంధ్రా పాలకుల నినాదంతో చంద్రబాబు భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీని షూట్ చేశారు టీఆర్ఎస్ నాయకులు.
అయితే, ఇప్పుడు ఎలాగూ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారి జాతీయ నినాదం అందుకుంది కనుక గతంలో మాదిరి ఆంధ్రా పాలకుల నినాదం అందుకొనే నైతిక హక్కు వదులుకోవాల్సి ఉంటుంది. సో.. టీడీపీతో పొత్తుకు ఒకే చెప్పినా బీజేపీని నిందించే పరిస్థితి ఉండదు. అందుకే చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో యాక్టివ్ పాలిటిక్స్ మొదలు పెట్టి బంతిని బీజేపీ కోర్టుకు వేశారు. బీజేపీ నుండి సానుకూల పవనాలైతే ఇంకా రాలేదు కానీ.. ఎక్కడ తమకి నష్టం జరుగుతుందోనని బీఆర్ఎస్ నేతలు మాత్రం విమర్శల దాడికి దిగారు.
సహజంగా ఇప్పుడున్న బీజేపీ ఏ రాజకీయ లాభం లేకుండా ఎవరితో స్నేహం చేయదు.. ఎవరితో చేతులు కలపదు. అందుకే ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీని ఒకేలా చూస్తుంది. రేపు ఎవరి అవసరానికి ఉపయోగం అనుకుంటే వాళ్ళే మిత్రులు.. మిగతా వాళ్ళు శత్రువులు కావాల్సిందే. దానిని దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబు రాజకీయానికి సిద్దమైనట్లు కనిపిస్తుంది. అయితే.. ఎవరు ఎవరితో పొత్తుకు వెళ్తారు? ఎవరు ఎవరికి దూరమవుతారు? ఎవరు కలిస్తే ఎవరికి నష్టం.. ఎవరికి లాభం అనేది ముందు ముందు మారనున్న సమీకరణాలను చూస్తే తప్ప అంచనాకు రాలేము.