Saturday, November 15, 2025
HomeతెలంగాణBRS is Scattered: బీఆర్ఎస్ కకావికలం

BRS is Scattered: బీఆర్ఎస్ కకావికలం

Bhatti Vikramarka: బీఆర్ఎస్ కకావికలమైందని, ఆ పార్టీ ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్ని ముక్కలవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు పని చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ లేదా ప్రభుత్వ పదవి ఏదో ఒకటి తప్పకుండా వస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్‌ను అధికారం నుంచి తొలగించడం సాధ్యం కాదని ఎంతో మంది అన్నారు.. కానీ మన కాంగ్రెస్ కార్యకర్తలు చేసి చూపించారన్నారు. వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలను ఒక ఉద్యమంలా కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు చేసే ప్రతి పనికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు యావత్ కేబినెట్ అండగా ఉంటుందన్నారు. లక్షలాదిమందిని కలుపుకొని కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన కఠోర శ్రమతోనే ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోపిడీ దొంగల్లా దోచుకుతిన్నారని విమర్శించారు. తాము అధికారం చేపట్టిన గంటలోపే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కులగణన చేపట్టామన్నారు. శాస్త్రీయంగా కులగణన చేపడితే.. బీజేపీ నాయకులు కాళ్లలో కట్టె పెడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని సవాళ్లను ఎదుర్కొని బీసీలకు న్యాయం చేసేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం చట్టబద్ధంగా ముందుకు వెళ్తుందన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్ రావు, సంతోష్ రావు దోచుకున్నారు. అందుకే హరీశ్‌కు రెండోసారి ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదని కవిత చెప్పింది. కాళేశ్వరంలో దోపిడీ జరిగిందని కేసీఆర్ కుటుంబ సభ్యులే ఒప్పుకుంటున్నారు. ఆ వాస్తవాలను వెలికితీసేందుకే కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించాం’ అని భట్టి విక్రమార్క తెలిపారు.

- Advertisement -

లక్ష మందితో బహిరంగ సభ : మీనాక్షినటరాజన్
ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్ తెలిపారు. కామారెడ్డి సాక్షిగా చేసిన బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న మహేశ్ కుమార్ గౌడ్‌కు అభినందనలు తెలిపారు. తాను ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండు నెలలకోసారి సమావేశం నిర్వహించడం శుభ పరిణామమన్నారు. వచ్చే విస్తృత స్థాయి సమావేశాలు జిల్లాల్లో నిర్వహించేలా ప్లాన్ చేస్తామన్నారు. ప్రతి కమిటీలో సోషల్ జస్టిస్‌‌కు అనుగుణంగా ఎంపిక ఉంటుందన్నారు. పార్టీలో 70 నుంచి 80 శాతం పాత వారికి పదవులు ఇచ్చామని, మిగిలిన 20 శాతం కొత్త వారికి అవకాశం కల్పించామన్నారు. తెలంగాణ మోడల్‌ను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కష్టతరమైనా సరే తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని పార్టీ యోచిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓసీ అయినప్పటికీ.. బలహీనవర్గాలకు చెందిన మహేశ్ గౌడ్‌తో కలిసి సమన్వయంతో పనిచేస్తూ ముందుకు వెళ్తుండటం అభినందనీయమని కొనియాడారు. 90 శాతం ప్రజలకు ప్రభుత్వ పథకాల లబ్ధి జరుగుతోందన్నారు. వచ్చే నెల నుంచి జూబ్లీ‌హిల్స్ ఉప ఎన్నికలపై పూర్తిగా దృష్టి సారిస్తామన్నారు. డీసీసీ కమిటీలు వచ్చే వారంలో పూర్తవుతాయన్నారు. గ్రామ స్థాయిలో ‘ఓట్ చోరీ’పై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామ అధ్యక్షుల ఎంపిక మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.

విజయవంతం చేద్దాం : మహేశ్ గౌడ్
కామారెడ్డి బహిరంగ సభను విజయవంతం చేద్దామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మనదేనన్నారు. ఉచిత బస్సు మొదలుకొని సన్నబియ్యం వరకు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచే చరిత్రాత్మక సంక్షేమ పథకాలు మన వద్దే ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పారదర్శకంగా కుల సర్వే నిర్వహించామన్నారు. కామారెడ్డిలో లక్ష మందితో నిర్వహించనున్న బహిరంగ సభ విజయవంతం చేద్దామన్నారు. ఎక్కడ మాట ఇచ్చామో.. అక్కడే సభ పెడుతున్నామన్నారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జిలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కో ఆర్డినేటర్లు, జిల్లా కమిటీ కోసం వేసిన కో ఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad