Ktr Kavitha : బీఆర్ఎస్‌లో అంతర్గత వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవిత, తన తండ్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ రావు, సంతోష్ రావు ఫ్రేమ్ చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవితకు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ఇచ్చిన “మాస్టర్ క్లాస్” గురించి బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్ట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేస్తూ కవితకు షాక్ ఇచ్చారు.
ఇటీవల కేసీఆర్, కేటీఆర్, ఇతర నేతలతో సమావేశమైన తర్వాత కవిత పీఆర్వోను బీఆర్ఎస్ మీడియా వాట్సాప్ గ్రూప్‌ల నుంచి తొలగించారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, కవిత ఇప్పటికే కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సస్పెన్షన్ జరిగితే కవిత తన కొత్త పార్టీని ప్రకటించే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
కవిత గతంలో కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్‌పై కూడా వివాదం చెలరేగింది. బీఆర్ఎస్‌ను బీజేపీతో కలపాలనే కుట్ర జరిగిందని, తాను దాన్ని వ్యతిరేకించానని కవిత ఆరోపించారు. ఈ ఘటనలు బీఆర్ఎస్‌లో విభేదాలను మరింత బహిర్గతం చేశాయి. కేటీఆర్, హరీష్ రావు ఒక వైపు, కవిత మరోవైపు నిలబడ్డారు. రేపు బీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


