తెలంగాణ అసెంబ్లీలో(Telangana Assembly) జరిగిన గందరగోళ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadish Reddy)ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సభలోని నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు, అసెంబ్లీ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు జగదీశ్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేస్తున్నానని ప్రకటించారు.
కాగా కాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారి తీశాయి. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినానాదాలు చేయడంతో జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రన్నింగ్ కామెంట్రీ ఆపి మూసుకుని కూర్చోవాలని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సభ్యులు అసహనానికి గురికావొద్దని సభా సంప్రదాయాలను పాటించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ సూచించారు.
అయితే స్పీకర్ వ్యాఖ్యల పట్ల జగదీశ్ రెడ్డి తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అందరికీ సమాన అవకాశాలున్నాయని.. కాకపోతే సభ్యుల తరపున పెద్ద మనిషిగా ఆ స్థానంలో కూర్చున్నారని తెలిపారు. అంతేతప్ప సభ స్పీకర్ సొంతం కాదని వ్యాఖ్యానించారు. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించిన అనంతరం ఆయనను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.