కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన వివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Koushik Reddy)ని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కరీంనగర్ రెండో అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట ఆయనను పోలీసులు హాజరుపర్చారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌశిక్ రెడ్డిపై నమోదైన రిమాండ్ రిపోర్ట్ కొట్టివేశారు. ఆయనపై నమోదైన మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించారు. అలాగే కౌశిక్ రెడ్డి రూ.10వేల చొప్పున మూడు, రూ.25వేల చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
కాగా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. సంజయ్ కుమార్‌పై దురుసుగా ప్రవర్తించారంటూ సంజయ్ పీఏ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇక కలెక్టరేట్ లో బూతులు తిడుతూ దాడికి ప్రయత్నించారంటూ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో గందరగోళం సృష్టించి, సమావేశాన్ని పక్కదారి పట్టించారంటూ కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో కేసు నమోదైంది. ఈ ఫిర్యాదుల మేరకు కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.