BRS MLA Maganti Gopinath Political Career: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోఫినాథ్(Maganti Gopinath)కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న ఆయన.. కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.
1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు మాగంటి గోపినాథ్ జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేయగా.. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం రాజకీయాల మీద ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరారు.
1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఇక 2014లో తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేశార. ఆ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం అసెంబ్లీలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ(పీఈసీ) సభ్యుడిగా పనిచేశారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పై ముచ్చటగా మూడోసారి గెలిచారు. జనవరి 26, 2022న బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.