ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తొలిసారి నిజామాబాద్ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ను(KCR) ఎదుర్కొనే ధైర్యం లేక తనపై, కేటీఆర్(KTR)పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తమది భయపడే రక్తం కాదని.. భయపెట్టే రక్తం అని తెలిపారు. తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను.. దేనికి భయపడనని అన్నారు. ఎన్ని కేసులు పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటకు వస్తారని పేర్కొన్నారు.
కేంద్రాన్ని ఎదురిస్తే బీజేపీ కేసులు పెడుతోందని, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ పెట్టే అక్రమ కేసుల గురించి చెప్పనవసరం లేదని మండిపడ్డారు. పేరు మర్చిపోయినా, రైతులు భూములు ఇవ్వకపోయినా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేసులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత భయం? బరువు ఎత్తుకున్నోడు ఓపికతో ఉండాలని సూచించారు. డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ ఏమైంది? అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500, కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో పోలీసుల జులుం నడుస్తుందని.. రాబోయేది గులాబీ జెండా శకమే అని కవిత ధీమా వ్యక్తం చేశారు.