Kavitha comments on Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కాళేశ్వరం కూదు.. కూలేశ్వరం అంటూ విమర్శలు చేస్తూ ఉంటుంది. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉంటారు. బీజేపీ కూడా మాజీ సీఎం కేసీఆర్, ఇతర గులాబీ నేతలు కాళేశ్వరం పేరుతో కమిషన్లు దండుకున్నారని.. దీనిపై విచారణ చేయాలని ఆరోపిస్తూ ఉంటారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం కాళేశ్వరం తెలంగాణకు జీవనాడి అని.. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు అని కౌంటర్ ఎటాక్ చేస్తూ ఉంటారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌లను విచారించింది. మరికొన్ని రోజుల్లో ఈ కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నివేదిక ప్రకారం సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు అని తెలిపారు. పునాదులు తవ్విన నాటి నుంచే ఈ ప్రాజెక్టుపై కొందరు పనికట్టుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం జలదోపిడీకి పాల్పడుతుంటే సొంత రాష్ట్రం నాయకులు మాత్రం రాష్ట్రానికి ఉపయోపగడే ప్రాజెక్టునే తప్పు బడుతున్నారని విమర్శించారు. గోదావరి నది నుంచి ఎక్కువ నీటిని వినియోగించుకునే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలన్నారు. తెలంగాణకు ఎప్పటికీ కాళేశ్వరమే లైఫ్ లైన్ అని ఆమె పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల బీసీ నినాదం ఎత్తుకున్న కవిత మరో కీలక పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్ రోకో నిర్వహిస్తామని స్పష్టం చేశారు.ప్రధాని మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాస్తున్నామని తెలిపారు. జులై 8లోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కవిత డిమాండ్ చేశారు.