BRS Party: తెలంగాణ రాష్ట్ర సమితిని ‘భారతీయ రాష్ట్ర సమితి’గా పేరు మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. పేరు మార్పుపై గురువారం పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక లేఖ పంపగా ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం “భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించి, ఎన్నికల సంఘం పంపిన లేఖపై కేసీఆర్ సంతకం చేసి రిప్లైగా పంపాలని భావిస్తున్నారు. అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత్ రాష్ట్ర సమితిగా మార్పు ఒకరకంగా ఇది కేసీఆర్ సాహసేపేతమైన నిర్ణయంగా చెప్పుకోవాలి. జాతీయ రాజకీయాలలోకి వెళ్లాలనుకుంటున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితితో వీలుపడదని పేరు మార్పుకి సిద్ధమయ్యారు. అయితే.. ఇది ఒక్క పేరు మార్పు మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి.. అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కారణమైన తెలంగాణ సెంటిమెంటును భారత్ రాష్ట్ర పార్టీ కోసం వదిలేసుకోవాల్సి వస్తుంది.
తెలంగాణ సెంటిమెంట్ వదిలేయడం అంటే టీఆర్ఎస్ పార్టీ నేతలు అసలెన్నడూ ఊహించనిదే అనుకోవాలి. కానీ, ఇప్పుడు అదే వదులుకొని జాతీయ రాగం అందుకోవాలి. అంతేకాదు.. నిన్న మొన్నటి వరకు పరాయి పాలన అంటూ ఇతర పార్టీలను తెలంగాణలో వాలనీయకుండా తరిమితే.. ఇప్పుడు అదే పార్టీలు.. అదే తెలంగాణలో గుచ్చి గుచ్చి బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం ఖాయం. అంటే ఒకవైపు జాతీయ రాజకీయాలలో బీజేపీ-కాంగ్రెస్ లాంటి బలమైన పార్టీలను ఢీ కొడుతూనే ఇక్కడ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు సమాధానమివ్వాలి. మరి దీనిని టీఆర్ఎస్ పార్టీ ఎలా నెగ్గుకొస్తుంది?.. అసలు కేసీఆర్ తర్వాత ప్లాన్ ఏంటన్నది ముందు ముందు చూడాలి.