BRS tweet on state financial situation: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై బీఆర్ఎస్ సంచలన ట్వీట్ చేసింది. తెలంగాణలోని సామాన్యుల పరిస్థిత దారుణంగా ఉందని తన అధికార ఎక్స్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. మార్కెట్లో లక్ష రూపాయలు కూడా పుట్టని గడ్డు పరిస్థితులు దాపురించాయని పేర్కొంది. రేవంత్‌రెడ్డి అనుభవరాహిత్యమే ఈ పరిస్థికి కారణమని తెలిపింది.
రాష్ట్రంలో కాసుల కటకట: పాలనపై అనుభవంలేని సీఎం రేవంత్‌రెడ్డి వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోయిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందని పేర్కొంది. ద్రవ్య చలామణి పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపింది. సామాన్యుల నుంచి వ్యాపారుల దాకా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కాసుల కటకట మొదలైందని పేర్కొంది. మార్కెట్లో లక్ష రూపాయలు కూడా పుట్టని గడ్డు పరిస్థితులు దాపురించాయని ..కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
గణాంకాలే నిదర్శనం: సెప్టెంబర్‌లోని గణాంకాలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెబుతున్నాయని పేర్కొంది. సెప్టెంబర్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డిఫ్లేషన్ దశలోకి పడిపోయినట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. సెప్టెంబర్‌లో ప్రతి ద్రవ్యోల్బణం (డిఫ్లేషన్) 0.15శాతంగా నమోదైనట్టు వివరించింది. ద్రవ్యోల్బణం నెగటివ్‌లోకి వెళ్లిన ఈ దుర్భర పరిస్థితిని కూడా ఓ విజయంగా ప్రచారం చేసుకోవాలనుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడిందని సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్ ఆరోపించింది. ఒకవేళ వరుస డిఫ్లేషన్ అనేది సానుకూల సంకేతమైతే.. దేశంలో మరెక్కడా ఈ పరిస్థితి లేదని పేర్కొంది. గడిచిన 11 ఏండ్లలో ఎన్నడూ.. ఇంతటి దారుణ పరిస్థితులు తెలంగాణలో కనిపించలేదని పేర్కొంది. దీనంతటికి కారణం ఆర్థిక వ్యవస్థపై రేవంత్‌రెడ్డికి పట్టులేకపోవడం వల్లనే అని బీఆర్ఎస్ ఆరోపించింది. ప్రభుత్వ నిర్లక్ష్యమే రాష్ట్ర ఆర్థికం అతలాకుతలం కావడానికి కారణమని విమర్శించింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.


