Attack on media office: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కథనాలు ప్రసారం చేశారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు సదరు మీడియా కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాయలం డోర్లు, స్టూడియోతో పాటు ఆఫీస్ బయట నిలిపి ఉంచిన కార్లపై బండరాళ్లు వేసి ధ్వంసం చేశారు.
కేటీఆర్ పై అనుచిత కథనాలు ప్రసారం చేశారంటూ ఆ మీడియా ఆఫీసు ఎదుట బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. అయితే ఉన్నట్టుండి బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఛానల్ కార్యాలయంపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన ఛానల్ సిబ్బంది హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, కార్లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టి అదుపులోకి తీసుకున్నారు.
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తనపై వస్తున్న దుష్ప్రచారంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మీడియా సంస్థలను నడుపుతున్న కొంతమంది వ్యక్తులు జర్నలిస్టుల ముసుగులో కావాలనే ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారని పోస్ట్ చేశారు. కొంతమంది మీడియా సంస్థల యజమానులు తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. తనపై పదేపదే చేస్తున్న వ్యక్తిత్వ హననం వలన తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు బాధ పడుతున్నారని తెలిపారు. ఈ దుష్ప్రచారం వెనక ఎవరు ఉన్నారో తనకు తెలుసని.. వారిపై తగిన రీతిలో చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హెచ్చరించారు.
కేటీఆర్ హెచ్చరిస్తూ ట్వీట్ చేసిన కాసేపటికే బీఆర్ఎస్ శ్రేణులు సదరు మీడియా సంస్థపై దాడి చేయడం గమనార్హం. మరి ఏకంగా మీడియా కార్యాలయంపైనే దాడి చేసిన ఘటనపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే ప్రభుత్వ పెద్దలు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ మొదలైంది.