Saturday, November 15, 2025
HomeTop StoriesKTR: 'బీఆర్ఎస్ అగ్రికల్చర్‌ తెస్తే.. కాంగ్రెస్ గన్ కల్చర్ తెచ్చింది'

KTR: ‘బీఆర్ఎస్ అగ్రికల్చర్‌ తెస్తే.. కాంగ్రెస్ గన్ కల్చర్ తెచ్చింది’

KTR sensational comments: రాష్ట్రంలో మంత్రుల మధ్య ఉన్న విబేధాల కారణంగా ఐఏఎస్ ఆఫీసర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. అధికారులను వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వాలకు మొదటి నుంచి ఉన్న అలవాటేనని కేటీఆర్ విమర్శించారు. మంత్రి జూపల్లి వేధింపుల వల్లే ఐఏఎస్ అధికారి సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారని ఆరోపించారు. మంత్రుల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు తప్పులు చేస్తే.. భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ అధికారులను హెచ్చరించారు.

- Advertisement -

అవినీతి, సెటిల్‌మెంట్లపై తీవ్ర విమర్శలు: తాజాగా అవినీతికి పాల్పడిన ఒక ఓఎస్డీని మంత్రి కొండా సురేఖ స్వయంగా తన కారులో తీసుకెళ్లి అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసుల నుంచి రక్షించారని కేటీఆర్ ఆరోపించారు. సెటిల్‌మెంట్లు చేయమని సీఎం రేవంత్ రెడ్డే తుపాకీ ఇచ్చాడంటూ మంత్రి కుమార్తె చెబుతోందని అన్నారు. దీనికి మించి సాక్ష్యం ఏం కావాలని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం వర్గీయులు, మంత్రి వర్గీయులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నివాసం పూర్తిగా సెటిల్‌మెంట్లకు అడ్డగా మారిందని అన్నారు. నీకింత.. నాకింత అనే సెటిల్‌మెంట్లు తప్ప రాష్ట్రంలో పాలన లేదని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అగ్రికల్చర్‌ తెస్తే.. కాంగ్రెస్ గన్ కల్చర్ తెచ్చిందని కేటీఆర్ ఎద్దేవ చేశారు.

బీజేపీ..కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం: తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఇంత అరాచకాలు ఓపెన్‌గా జరుగుతున్నా బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారులు రాజీనామా చేస్తుంటే , పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడుతుంటే బీజేపీ స్పందించక పోవడం దారుణమని అన్నారు. రాష్ట్రానికి సీబీఐ లాంటి సంస్థలు ఎందుకు రావడం లేదని ఆయన అన్నారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/hyderabad-police-special-branch-corruption-allegations/

డీజీపీ తీరుపై సెటైర్లు: మాకు ఏ బుక్కు లేదు.. కేవలం ఖాకీ బుక్ ను మాత్రమే ఉందని చెప్పిన డీజీపీ శివధర్‌రెడ్డి పత్తా లేరని కేటీఆర్ సెటైర్ వేశారు. గన్నులు పెట్టి బెదిరించినా గమ్మునుంటారా అని ప్రశ్నించారు. ఖాకీ బుక్కును కాకి ఎత్తుకెళ్లిందా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్వాన పాలనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను 20 రోజులు జైల్లో పెట్టిన పోలీసులు.. పారిశ్రామికవేత్తపై తుపాకీతో బెదిరించిన వారిపై చర్యలు తీసుకోకుండా ఏం పీకుతున్నారని ప్రశ్నించారు. డీజీపీ తన నిజాయితీని రుజువు చేసుకోవాలంటే మంత్రి సురేఖ కూతురు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad