రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బుర్ర రవితేజ గౌడ్ కు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, నిరుద్యోగ జేఏసీ వ్యవస్థాపకుడిగా, వేములవాడ, దుబ్బాక నియోజకవర్గాల స్తంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలవడంతో పాటు వేములవాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేసిన రవితేజ, చివరికి 2023 ఎన్నికల్లో రమేష్ బాబుకు పార్టీ టిక్కెట్ రాకుండా చేయడంలోనూ, ‘వేములవాడ గడ్డ..బిసి అడ్డా’ అనే రీతిలో ప్రజలను చైతన్యం చేయడంలోనూ సఫలమయ్యాడు. అదే సమయంలో నియోజకవర్గంలోని యువకులను ఏకం చేసి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బి.సి నాయకుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గా కొనసాగుతున్న ఆయన సేవలను గుర్తించిన పార్టీ అదిష్టానం ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడిగా మరో కీలక బాధ్యతను అప్పగించింది. ఈ మేరకు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ రవితేజ గౌడ్ కు నియామక పత్రం అందజేశాడు.
హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు అభిమానులు
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పేట మండలం కొలనూర్ గ్రామానికి చెందిన రవి తేజ గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రవితేజ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ, పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రజా సేవే పరమావధిగా భావించే యువ నాయకుడు రవితేజ గౌడ్ రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని కోరుకుంటున్నారు.
ఎంపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తా: బుర్ర రవితేజ గౌడ్
తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మిగతా పార్టీ శ్రేణులందరీ సహకారంతో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తా. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.