BV Pattabhiram Died: డా. బీవీ పట్టాభిరామ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వ్యక్తిత్వ వికాసానికి నిపుణుడిగా, ప్రముఖ రచయితగా, ఇంద్రజాలికుడిగా ఆయన పేరుగాంచారు. చనిపోయే సమయానికి ఆయన వయసు సుమారు 75 సంవత్సరాలు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పట్టాభిరామ్ ఇంద్రజాలికుడింగా, మోటివేషనల్ స్పీకర్‌గా ఆయన పేరు ప్రఖ్యాతల్ని కలిగి ఉన్నారు. ఆయన రచించిన అనేక పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, వర్క్‌షాపులు లక్షల మందికి మార్గనిర్దేశం చేశాయి. ముఖ్యంగా ఆయన రచించిన “ఆలోచన మార్చు – జీవితం మారుతుంది”, “విజయం నీ భవితవ్యమే” వంటి పుస్తకాలు యువతలో స్ఫూర్తిని నింపాయి.
పట్టాభిరామ్ భార్య జయ పట్టాభిరామ్ కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా పేరుగాంచారు. అతని ఏకైక కుమారుడు ప్రశాంత్ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. రేపు ఖైరతాబాద్‌లోని ఆయన నివాసంలో ఉదయం 9 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం అంత్యక్రియలు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహిస్తామని అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ప్రస్థానం: తూర్పుగోదావరి జిల్లా చింతలూరిలో పట్టాభిరామ్ జన్మించారు. కాకినాడలో విద్యార్థిగా ఉన్నప్పుడు మాయాజాల కళను ఆయన అభ్యసించారు. 1970లలో ఉద్యోగంతోపాటు పబ్లిక్ షోలు చేస్తూ మంచి గుర్తింపుని పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సైకాలజీ, ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యోగా, హిప్నోటిజంపై పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పట్టాను పొందారు.
చదువు అనంతరం భారత ఆహార సంస్థలో ఉద్యోగిగా పనిచేశారు. అప్పటికే వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇస్తున్న పట్టాభి కొంతకాలం తర్వాత ఫుల్‌టైమ్ మోటివేషనల్ స్పీకర్‌గా మారారు. అర్థశతాబ్ద కాలంగా సైకాలజీ, జ్ఞానవిజ్ఞాన రంగాల్లో ఆయన చేసిన కృషి చేసి గుర్తింపు సాధించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పలువురు రాజకీయ, సినీ విశ్లేషకులు తెలిపారు.