Cabinet Rank For Sudarshan Reddy and Premsagar Rao: తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ ర్యాంకు కట్టబెట్టింది. ప్రభుత్వ సలహాదారుడిగా సుదర్శన్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 6 గ్యారెంటీల అమలు బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఆయన ప్రస్తుతం ఆయన బోధన్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. మరోవైపు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరూ, కేబినెట్ బెర్త్ కోసం పోటీపడిన సంగతి తెలిసిందే. తాజాగా, అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టడంతో వీరిని బుజ్జగించడంలో భాగంగా అధిష్టానం వీరిద్దరికీ కేబినెట్ ర్యాంకు కేటాయించనట్లు తెలుస్తోంది. అయితే, మంత్రి పదవి కోసం పట్టుబడుతోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: https://teluguprabha.net/career-news/ts-board-releases-schedule-for-intermediate-exams/
రాజ్ భవన్‌లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం..
కాగా, తెలంగాణ కేబినెట్లోకి అనూహ్యంగా ఇవాళ కొత్త మంత్రి చేరారు. తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు పాల్గొన్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినేట్‌లో ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఓసీ, బీసీలకు చోటు దక్కే అవకాశం ఉంది. ఇక అజారుద్దీన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతానికి అజారుద్దీన్‌కు ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, మైనార్టీ సంక్షేమం, క్రీడలు లేదా హోం శాఖ వంటి కీలక శాఖల్లో ఏదో ఒకటి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు..
రాష్ట్ర కేబినెట్‌లో మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, మైనారిటీ ఓట్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగానే ఈ హడావుడి మంత్రివర్గ విస్తరణ జరిపించారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఈ మంత్రివర్గ విస్తరణ చేపట్టడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాగా, అజారుద్దన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం ద్వారా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు కలిసి రానుంది. జూబ్లీహిల్స్ పరిధిలో లక్షకు పైగా ముస్లిం మైనార్టీ ఓటర్లుండగా వారి మద్ధతు తమకే లభిస్తుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది.


