బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) బంధువులపై పోలీసు కేసు నమోదైంది. హరీష్ రావు తమ్ముడు, మరదలు, మేనమామ, మరో ముగ్గురు వ్యక్తులు, ఫాస్మో కంపెనీపైనా మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదైంది. మియాపూర్‌లో దండు లచ్చిరాజు అనే వ్యక్తికి చెందిన ఐదంస్తుల భవనాన్ని తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.
ఇటీవల తనకు తెలియకుండా ఇంటిని విక్రయించారని.. బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రామిసరీ నోటుతో మోసం చేశారని లచ్చిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు అతనిపై ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా లచ్చిరాజు, హరీష్ రావు కుటుంబసభ్యుల మధ్య ఈ ఆస్తి కోసం 2019 నుంచి గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ కేసు నమోదుపై హరీష్ రావుతో పాటు ఆయన కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఇంతవరకు స్పందించలేదు.
ఇదిలా ఉంటే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి(Revant Reddy) ఎందుకు అమలు చేయడం లేదంటూ నిలదీస్తున్నారు. ఇదే సమయంలో హరీష్ రావు విమర్శలపై ప్రభుత్వ పెద్దలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో హరీష్ రావు కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.