తెలంగాణలో మరోసారి కులగణన(Cast Census) సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడుతూ.. కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందని తెలిపారు. వివిధ కారణాల వల్ల కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరో అవకాశం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈనెల 16 నుంచి 28 వరకు వివరాలు అందజేయాలని సూచించారు.
ఇక బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో కేబినెట్ తీర్మానం చేయనుందని తెలిపారు. శాసనసభలో బిల్లు ఆమోదం చేసి చట్టబద్ధం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. కులగణన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని వెల్లడించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో ఆమోదానికి కృషి చేస్తామన్నారు. దశాబ్దాల ఓబీసీల కలలను నిజం చేసేందుకు కృషి చేస్తామన్నారు. 42 శాతం ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు చేసే కుట్రలు చేస్తే తిప్పి కొడతామని భట్టి వివరించారు.