CBI investigation into Kaleshwaram project: దాదాపు మూడేళ్ల విరామం తర్వాత, తెలంగాణ గడ్డపైకి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అడుగుపెట్టనుంది. రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశాన్ని నిరోధిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపైనే సీబీఐ కొరడా ఝుళిపించనుంది. అసలు ప్రభుత్వం తన వైఖరిని ఎందుకు మార్చుకుంది? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను పక్కనపెట్టి, జాతీయ డ్యాం భద్రతా అథారిటీ (NDSA) నివేదిక ఆధారంగానే విచారణ ఎందుకు కోరుతోంది..? ఇకపై ఏం జరగబోతోంది..? ఈ దర్యాప్తు ఎవరెవరి మెడకు చుట్టుకోనుంది..?
పాత జీవోకు సవరణ… దర్యాప్తునకు మార్గం సుగమం: గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టు 30న జీవో 51ని జారీ చేసి, రాష్ట్రంలో సీబీఐ నేరుగా విచారణ చేపట్టకుండా నిరోధించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను సవరిస్తూ జీవో 104ను జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ వైఫల్యాలపై దర్యాప్తు చేసేందుకు సీబీఐకి ప్రత్యేకంగా అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయడం, సీబీఐ డైరెక్టర్ నుంచి వెంటనే అక్నాలెడ్జ్‌మెంట్ రావడం చకచకా జరిగిపోయాయి.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/4-year-old-gir-dies-as-school-bus-runs-over/
ఎన్డీఎస్ఏ నివేదికే ఆధారం… ఎందుకంటే : కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో తీవ్రమైన క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసినప్పటికీ, దానిపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున, ప్రస్తుతానికి దానిని పక్కనపెట్టారు. దానికి బదులుగా, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీ (NDSA) ఇచ్చిన తుది నివేదికను ఆధారంగా చేసుకుని విచారణ జరపాలని ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది.
ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది?: ప్రణాళిక, డిజైన్, నిర్మాణంలో నాణ్యతా లోపాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ విఫలమైందని ఎన్డీఎస్ఏ తన నివేదికలో కుండబద్దలు కొట్టింది. ఈ అంశాలనే సీబీఐ ప్రధానంగా విచారించనుంది.
దర్యాప్తునకు దారితీసిన పరిణామాలు:
అక్టోబరు 21, 2023: మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లో పలు పియర్‌లు కుంగిపోయాయి.
అక్టోబరు 22, 2023: కేంద్రం ఎన్డీఎస్ఏ కమిటీని ఏర్పాటు చేసింది.
ఏప్రిల్ 24, 2025: ఎన్డీఎస్ఏ తన తుది నివేదికను సమర్పించి, ప్రాజెక్టులోని లోపాలను ఎత్తిచూపింది.
ఆగస్టు 31, 2025: రాష్ట్ర శాసనసభలో చర్చ అనంతరం, బ్యారేజీల నిర్మాణ వైఫల్యాలపై విచారణను సీబీఐకి అప్పగించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
సెప్టెంబరు 1, 2025: సీబీఐ ప్రవేశానికి అనుమతిస్తూ ప్రభుత్వం జీవో 104ను జారీ చేసింది.
ALSO READ:https://teluguprabha.net/telangana-news/revanthreddy-visits-rain-affected-kamareddy/
ఇకపై ఏం జరగనుంది : ప్రభుత్వం పంపిన లేఖ, జీవో ఆధారంగా సీబీఐ ప్రాథమిక విచారణ (PE) లేదా నేరుగా కేసు (RC) నమోదు చేసే ప్రక్రియను ప్రారంభిస్తుంది.
డీఓపీటీ నోటిఫికేషన్: సీబీఐ తన ప్రతిపాదనలను కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖకు (DoPT) పంపుతుంది. అక్కడి నుంచి అధికారిక నోటిఫికేషన్ వెలువడుతుంది.
గవర్నర్ అనుమతిపై సందిగ్ధత: ప్రజాప్రతినిధులపై దర్యాప్తు చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరం. అయితే, ప్రభుత్వం ఆధారంగా చూపిన ఎన్డీఎస్ఏ నివేదికలో ఏ ప్రజాప్రతినిధి పేరు లేదు. కేవలం సాంకేతిక, నిర్మాణ లోపాలను మాత్రమే ప్రస్తావించారు. అదే సమయంలో, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రుల పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కేసు నమోదుకు గవర్నర్ ముందస్తు అనుమతి అవసరమా లేదా అనే దానిపై న్యాయపరమైన చర్చ జరుగుతోంది.
ప్రభుత్వం మాత్రం ఈ దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని, పబ్లిక్ సర్వెంట్లు, ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలపై విచారణకు పూర్తి స్వేచ్ఛనిస్తామని తన జీవోలో స్పష్టం చేసింది.


