MLC Kavitha : ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సమాధానం ఇచ్చింది. ఈ నెల 11న విచారణ జరిపేందుకు అంగీకారం తెలిపింది. 11న ఉదయం 11 గంటలకు వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఆర్‌పీసీ 160 కింద సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని తెలిపింది. అయితే..ఎఫ్ఐఆర్ కాఫీని తనకు అందించాలని కోరుతూ కవిత సీబీఐకి లేఖ రాశారు. వైబ్‌సైట్‌లో ఎఫ్ఐఆర్ కాపీ ఉందని ఈ మెయిల్ ద్వారా సీబీఐ రిప్లై ఇచ్చింది. దీనిపై స్పందించిన కవిత మళ్లీ సీబీఐకి లేఖ రాశారు.
వెబ్‌సైట్‌లో ఉన్న ఎఫ్ఐఆర్ కాపీని క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. “ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితుల పేర్లు సహా అన్ని అంశాలను చూశాను. ఎక్కడా నా పేరు లేదు. అయినప్పటికీ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. ముందుగా ఖరారు అయిన కార్యక్రమాల వల్ల ఈ నెల 6న సీబీఐ అధికారులను కలుసుకోలేను. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో మీకు అనువైన ఓ రోజును చెబితే హైదరాబాద్‌లోని నా నివాసంలో అందుబాటులో ఉంటా. త్వరగా తేదీని ఖరారు చేసి చెప్పండి. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తా” అని కవిత మరో మెయిల్ పంపారు. ఈ మెయిల్‌కి సీబీఐ తాజాగా రిప్లై ఇచ్చింది.