తెలంగాణలో రాజకీయ కాక రేపుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల(HCU Lands) వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కంచ గచ్చిబౌలి భూములపై వాస్తవ నివేదికను పంపాల్సిందిగా తెలంగాణ అటవీ శాఖను ఆదేశించింది. ఈమేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. న్యాయస్థానాల తీర్పులను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని.. అటవీ చట్టాలకు లోబడి చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ భూమికి సంబంధించిన వాస్తవ నివేదిక వివరాలతో పాటు తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా సెంట్రల్ యూనిర్సిటీకి అనుకున్న 400 ఎకరాల భూములను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ భూములను చదును చేసేందుకు జేసీబీలు, బుల్డోజర్‌లను పంపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణం, జంతువుల సంరక్షణ కాపాడాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. వీరి ఆందోళనలకు బీఆర్ఎస్,బీజేపీ కూడా మద్దలు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ఈ భూముల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తారు.