Friday, January 23, 2026
HomeతెలంగాణBandi Sanjay: బండి సంజయ్‌ బంపరాఫర్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 10 లక్షలు ఇస్తామని హామీ

Bandi Sanjay: బండి సంజయ్‌ బంపరాఫర్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 10 లక్షలు ఇస్తామని హామీ

Central Minister Bandi Sanjay Announces Huge Offer: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఇవాళ (మంగళవారం) సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల తేదీలు, నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే, ఆ గ్రామాభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ. 10 లక్షల నిధులు అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాను మాట ఇస్తే తప్పే మనిషిని కాదని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ప్రజలను ఏకం చేసి అభివృద్ధి వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించేందుకు ఈ నిధులు ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ప్రోత్సాహక నిధులు ఇస్తామని హామీ ఇచ్చి మొండిచేయి చూపిందని బండి సంజయ్ విమర్శించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైతం ఏకగ్రీవం పేరుతో నజరానా ప్రకటించి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల మాటలు నమ్మి ఏకగ్రీవం చేసిన పంచాయతీల ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని గుర్తు చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/harish-rao-slams-govt-on-indiramma-saree-distribution-and-loan-scheme/

గ్రామాలకు నిధులు ఇస్తోంది కేంద్రమే..

కాగా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు మళ్లీ ప్రలోభాలకు తెరలేపాయని ఆరోపించారు. వారి మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తోంది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రమే అని బండి సంజయ్ ఉద్ఘాటించారు. కేంద్రం నిధుల కోసమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని.. ఈ విషయాన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే, గ్రామాల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగానే బండి సంజయ్‌ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
కాగా, బండి సంజయ్ ఈ ప్రకటన చేయడానికి కొద్దిసేపటి ముందే రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రధాన అధికారిణి రాణి కుముదిని గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ పోలింగ్ మూడు దశల్లో జరగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News