Bandi Sanjay| గ్రూప్1 పరీక్షల(Group1 Exams) నిర్వహణను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనకు కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మద్దతు తెలిపారు. అభ్యర్థులు చలో సచివాలయంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బండి సంజయ్ కూడా వారితో కలిసి తెలుగుతల్లి ఫ్లైఓవర్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై భైఠాయించారు. అయితే అక్కడకు భారీగా చేరుకున్న పోలీసులు సంజయ్‌ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రూప్-1 అభ్యర్థులు, బీజేపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. అతి కష్టం మీద బండి సంజయ్‌ను అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌కి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి జీవో 29పై చర్చకు రావాలని ఆహ్వానించారు.
కాగా సోమవారం నిర్వహించనున్న గ్రూప్1 పరీక్షలు వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు పట్టుబడుతున్నారు. మూడు రోజులుగా అశోక్ నగర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వీరికి ప్రతిపక్ష నేతలు కూడా మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేయడం అమానుషమని మండిపడుతున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం గ్రూప్1 పరీక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టంచేస్తోంది. అభ్యర్థులు అనవసరంగా ప్రతిపక్షాల రాజకీయ కుట్రలో భాగం కావొద్దని హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలు మార్లు పరీక్షలు వాయిదా పడటంతో అనేక మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రూప్1 పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొంది. మరోవైపు హైకోర్టు ఆదేశాలను అభ్యర్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం ఉదయం సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అదే రోజు మధ్యాహ్నం 2.30గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.