Bandi Sanjay comments on CM Ramesh’s statements: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా కేటీఆర్, BRSపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య జరుగుతున్న ఆరోపణలు ఇప్పుడు తారా స్థాయికి చేరాయి. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ సైతం సీఎం రమేష్ ఆరోపణలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేశ్ చేసిన ఆరోపణల్లో నిజం ఉందంటూ బండి సంజయ్ సమర్థించారు.
“కేటీఆర్‌కు టికెట్ రావడానికి ఆర్థిక సహాయం సీఎం రమేశ్ ఇచ్చినదే” అని బండి సంజయ్ తెలిపారు. అంతేకాక, “కేటీఆర్ ఎమ్మెల్యే కావడంలో సీఎం రమేశ్ పాత్ర కీలకమైందని, ఈ విషయాన్ని ప్రజల ముందు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని” అభిప్రాయపడ్డారు. కేటీఆర్‌ను ప్రత్యక్ష చర్చకు ఆహ్వానిస్తూ, “కరీంనగర్‌లో వేదికను నేనే ఏర్పాటు చేస్తాను, మధ్యవర్తిగా కూడా వ్యవహరిస్తాను” అని సవాల్ విసిరారు.
కేటీఆర్ భాషపై విమర్శలు – బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు
కేటీఆర్ తన వ్యాఖ్యల్లో వాడిన భాషను బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. “ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. వ్యక్తిగత దూషణలు రాజకీయం కాదు” అని అన్నారు. “కేటీఆర్ భాష మార్చుకోకపోతే, తగిన విధంగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది” అని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పార్టీని “తండ్రి, కొడుకు, అల్లుడు పార్టీ”గా అభివర్ణించిన బండి సంజయ్, అది పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. “ఇలాంటి పార్టీ బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఎక్కడ లేదు, అటువంటి ప్రసక్తే రాదని” ఆయన స్పష్టం చేశారు.
ఇక సీఎం రమేశ్ – కేటీఆర్ మధ్య విమర్శల పరస్పరం ముదిరిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నికల సమయంలో కేటీఆర్ తన వద్దకు వచ్చి, తండ్రి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదని వాపోయారని సీఎం రమేశ్ ఆరోపించారు. “తాను మద్యస్థుడిగా వ్యవహరించి, టికెట్ వచ్చేలా చొరవ చూపానని” రమేశ్ వ్యాఖ్యానించారు. దీనిపై కేటీఆర్ ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని కూడా అన్నారు.
కేటీఆర్ తన ఆరోపణల్లో కంచ గచ్చిబౌలి భూములు, రోడ్ కాంట్రాక్టులకు సంబంధించిన అంశాలు ప్రస్తావించగా… రమేశ్ కూడా అదే స్థాయిలో ప్రత్యుత్తరం ఇచ్చారు. ఇరువురు నాయకుల మధ్య రాజకీయ వ్యాఖ్యల సునామీతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ ఆరోపణలు, సవాళ్లు కేవలం మాటల యుద్ధంగా ముగుస్తాయా? లేక బండి సంజయ్ ప్రతిపాదించినట్లు ఓ బహిరంగ చర్చకు ఇది దారితీస్తుందా? కేటీఆర్ ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశంగా మారింది.


