అదానీ ముడుపులు, మణిపుర్ అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో రాజ్ భవన్(Chalo RajBhavan) ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి సోమాజిగూడలోని రాజ్ భవన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం రాజ్ భవన్ ఎదుట భైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లించారు.