HCU భూముల వేలంపై తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ అందించే 400 ఎకరాల యూనివర్సిటీ భూములను వేలం వేయవద్దని యూనివర్సిటీ విద్యార్థులు కోరుతున్నారు. ఆ భూమిలో వేలాది పక్షులతో పాటు, జింకలు, నెమల్లు ఉన్నాయని ఆందోళనలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ కూడా విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలపడంతో పొలిటికల్ హీట్ ఎక్కింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా బయలుదేరుతున్న బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలను కూడా అడ్డుకుంటున్నారు .
తాజాగా ఈ వ్యవహారంపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) స్పందించారు. HCU వద్ద ఉన్న 400 ఎకరాలు ప్రభుత్వ భూమేనని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన చంద్రబాబు IMG సంస్థకు కేటాయించారని గుర్తు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడి ప్రభుత్వ భూమిని తిరిగి దక్కించుకున్నామని తెలిపారు. 19 ఏళ్లుగా కోర్టు వివాదాలు ఉండటంతో అక్కడ చెట్లు పెరిగాయన్నారు. ఇప్పుడు అలాంటి భూమిని అటవీ భూమిగా చిత్రీకరిస్తూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలాగే HCU భూముల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని విమర్శించారు.
ఇదిలా ఉంటే విద్యార్థుల ఆందోళనతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. కీలక మంత్రులతో భూముల వేలంపై చర్చిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమీక్ష జరుపుతున్నారు.