CMR Founder passed away: సుప్రసిద్ధ వస్త్ర వ్యాపార సంస్థలైన సీఎంఆర్, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకులు, ప్రముఖ వ్యాపారవేత్త చందన మోహనరావు(82) తుదిశ్వాస విడిచారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన,విశాఖలోని తన నివాసంలో ఈరోజు ఉదయం కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
వ్యాపార దక్షత అతని సొంతం: చందన మోహనరావు తన వ్యాపార దక్షతతో తెలుగు ప్రజలకు చేరువయ్యారు. ఆయన స్థాపించిన చందనా బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.నాణ్యత, విభిన్న రకాల వస్త్రాలకు చిరునామాగా నిలిచిన ఈ సంస్థలు నిలిచాయి. ముఖ్యంగా మహిళ ఆదరాభిమానాలను విశేషంగా చూరగొన్నాయి. మోహనరావు మరణ వార్త తెలియగానే వస్త్ర వ్యాపార రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.సీఎంఆర్ మరణ వార్త తెలియగానే పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
నాణ్యమైన వస్త్రాలకు చిరునామా: వ్యాపార రంగంలో పోటీ ఎక్కువ. అయినప్పటికీ మోహనరావు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో.. నాణ్యమైన వస్త్రాలు అందించే లక్ష్యంతో వ్యాపారాన్ని ప్రారంభించారు. సాధారణ వినియోగదారుల నుంచి ప్రముఖుల వరకు అందరికీ ఇష్టమైన బ్రాండ్‌గా అవి నిలిచాయి. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. సాధారణ స్థాయి నుంచి వ్యాపారంలో ఉన్నత స్థితికి ఎదిగారు. చందన మోహనరావు ఎదిగిన తీరుతో ఇప్పటికే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం: చందన మోహనరావు 40 సంవత్సరాలకు పైగా వస్త్ర, ఆభరణాల రిటైల్ వ్యాపారంలో ఉన్నారు. ఇది ఆయన పట్టుదల, దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం.
నాణ్యత, సరసమైన ధరలు: సీఎంఆర్ నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజీలేని సేవ మరియు విలువలతో తన సంస్థలను స్థాపించారు. ఈ సూత్రాలే తన బ్రాండ్‌ను ప్రతి తెలుగు కుటుంబానికి సుపరిచితం చేశాయి.
బ్రాండ్ ఇమేజ్: తెలుగు రాష్ట్రాల్లో ఆయన స్థాపించిన సంస్థలు సుస్థిరమైన బ్రాండ్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాయి. ముఖ్యంగా వివాహ, పండుగ సీజన్లలో వస్త్రాలు, బంగారు ఆభరణాల కోసం ఈ షాపింగ్ మాల్స్‌ను ప్రజలు అధికంగా సందర్శిస్తారు. ఆయన స్థాపించిన ఈ రిటైల్ గొలుసు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలలో విస్తరించాయి. వేలాది మందికి ఉపాధి కల్పనకు దారి తీసింది.


