అలిండియా ఫార్వార్డ్ బ్లాక్ కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థిగా చెన్నమనేని శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేసారు. రైతులు, గల్ఫ్, బీడీ కార్మికులు పెద్ద ఎత్తున నామినేషన్ కు హాజరయ్యారు. తన కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నమనేని శ్రీనివాస రావు మాట్లాడుతూ బీడీ కార్మికురాలి కుటుంబ బిడ్డనైన నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని అన్నారు. దేశంలో ఎక్కువ మంది గల్ఫ్ కార్మికులు ఉన్నది మన కోరుట్ల నియోజకవర్గంలోనేనని, గల్ఫ్
కార్మికులు మనోవేదనకు గురై మరణిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వారిని ఆదుకునే వారు లేరని, 32,000 మంది బీడీ కార్మికులు నియోజకవర్గంలో ఉన్నారని,
నియోజకవర్గంలో పెన్షన్ రాజకీయం నడుస్తోందని, గల్ఫ్ లో మరణిస్తే ఆర్థిక సహాయం ఏది,
మన ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు కావాలి.. మన ప్రాంతంలో పరిశ్రమలు కావాలి అని ఆయన డిమాండ్ చేశారు.
గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమయ్యిందని నిలదీసిన చెన్నమనేని, గల్ఫ్ లో మరణించిన కుటుంబానికి అండగా నిలిచేది ఎవరని అడిగారు. ప్రస్తుతం రేషన్ కార్డు లబ్దిదారులను చాలామందిని తొలగిస్తున్నారని, గల్ఫ్ కార్మికులను కూడా తొలగిస్తున్నారన్నారు. మన ప్రాంతానికి నామినేటెడ్ పోస్టులు లేవని, ఇంకొక్కరు ఎదుగొద్దు అనే ఆలోచన ఇక్కడి నేతలదంటూ భగ్గుమన్నారు. కోరుట్లలో కుటుంబ పాలన కొనసాగుతోందని, ఎంపి అరవింద్ ఇక్కడి ప్రాంత ప్రజలను మోసం చేసాడని ఆరోపించారు. అరవింద్ వస్తే మత కలహాలు పెరిగే అవకాశం ఉందన్నారు. మనం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిస్తే, అధికారంలోకి వచ్చే పార్టీలు మనవద్దకి వస్తాయన్నారు. మన ప్రాంత ప్రజల లబ్ధికొరకు మనకు స్పష్టమైన హామీ తీసుకుని అప్పుడు పార్టీలకు మద్దతిద్దామన్నారు. రాబోయే ఎన్నికల్లో డబ్బులు మస్తుగా ఇస్తారని, వాటిని తీసుకోండి, కానీ నన్ను ఆశీర్వదించండన్నారు.
నర్సింగా రావు అమావాస్య చంద్రుడు, అరవింద్ అక్కరకు వచ్చినవాడు. పరాయి ప్రాంత నాయకులను నమ్మకండి.. కోరుట్లను అభివృద్ధి చేసేందుకు ఎల్లవేళలా మీ వెంట ఉంటానని చెన్నమనేని భరోసా ఇచ్చారు.