Chevella bus Accident Updates: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు-టిప్పర్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 21 మంది చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలతో పాటు మరో కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉండడంతో వారి కుటుంబాలు చేవెళ్ల ఆసుపత్రిలో కన్నీరు మున్నూరుగా విలపిస్తున్నారు.
లారీ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి: 21 మృతదేహాలలో ఇప్పటివరకు 16టికి పోస్టుమార్టం నిర్వహించినట్టు చేవెళ్ల ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ తెలిపారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో పాటు లారీ డ్రైవర్ సైతం ప్రమాద స్థలిలోనే మరణించినట్టుగా చేవెళ్ల ఆసుపత్రి సూపరిండెంట్ అధికారి పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండు వాహనాలకు చెందిన డ్రైవర్ల కుటుంబ సభ్యులు రాకపోవడంతో.. వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించలేదని చేవెళ్ల ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. లారీ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు మృతి చెందిన 21 మంది మృతదేహాలలో ఇద్దరి వ్యక్తుల మృతదేహాలను గుర్తించలేదని తెలిపారు. ఆ రెండు మృతదేహాలతో పాటుగా డ్రైవర్ల మృతదేహాలకు పోస్టుమార్టం చేయలేదని సూపరిండెంట్ పేర్కొన్నారు.
గాంధీ ఆస్పత్రి నుంచి ఫోరెన్సిక్ బృందం: గాయపడిన వ్యక్తులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రితో పాటు గాంధీ ఆసుపత్రికి తరలించినట్టుగా చేవెళ్ల డాక్టర్లు పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రి నుంచి ఫోరెన్సిక్ బృందం లారీ డ్రైవర్ మృతదేహాన్ని పరిశీలించినట్లు తెలిపారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేశాడా లేదా అనేది ఫోరెన్సి బృందం నిర్ధారించాల్సి ఉంటుందని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
తాజాగా పలువురి మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు:
1.దస్తగిరి బాబా, డ్రైవర్;
2.తారిబాయ్ (45), దన్నారమ్ తండా;
3.కల్పన(45), బోరబండ;
4.బచ్చన్ నాగమణి(55); భానూరు;
5.ఏమావత్ తాలీబామ్, ధన్నారం తాండ;
6.మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్ మండలం;
7.గుర్రాల అభిత (21) యాలాల్;
8.గోగుల గుణమ్మ,బోరబండ;
9.షేక్ ఖాలీద్ హుస్సేన్, తాండూరు;
10.తబస్సుమ్ జహాన్, తాండూరు.
11. తనూషా, సాయిప్రియ, నందిని(ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెల్లు)
12. అఖిల(తాండూరు).
13. ఏనుగుల కల్పన
14. నాగమణి,
15. జహంగీర్.


