Chevella tragedy: చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఒక్కో బాధిత కుటుంబానికి చెందిన విషాద గాథ వింటుంటే కంటతడిరాక మానదు. వికారాబాద్ జిల్లాలోని తాండూరుకు చెందిన ఇద్దరు అమ్మాయిలను చేవెళ్ల దుర్ఘటన అనాథలను చేసింది. వారి అమ్మ, నాన్న చనిపోయారని తెలిసిన ఆ చిన్నారుల బాధ వర్ణనాతీతంగా మారింది. మా అమ్మ, నాయిన సచ్చిపోయిండ్రు.. మాకింక దిక్కెవరు దేవుడా..! అని ఆ అమ్మాయిలు ఏడుస్తుంటే.. చుట్టుపక్కల వారు సైతం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మీ అమ్మనాయిన చచ్చిపోయిండ్రని ఫోనొచ్చింది: చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన మిగిల్చిన విషాదం ఇంకా ..కంటతడి పెట్టిస్తూనే ఉంది. వికారాబాద్ జిల్లాలోని తాండూరుకు చెందిన ఇద్దరు అమ్మాయిలను అనాథలను చేసింది. దీంతో వారు రోడ్డున పడ్డారు. ఆ ఇద్దరు అమ్మాయిలు.. వారి తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు సైతం విలపిస్తున్నారు. మా అమ్మకు జెరం రావడంతో.. నాన్న దవఖానాకు తీసుకు వెళ్లేందుకే ఆ బస్సు ఎక్కారని తెలిపారు. ఆసుపత్రి వెళ్లిన మా అమ్మానాయినా.. సాయంత్రం వస్తారని అనుకున్నామని ఆ పిల్లలు తెలిపారు. కానీ అంతలోనే మీ అమ్మనాయిన చచ్చిపోయిండ్రని ఫోనొచ్చిందంటూ.. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలు విలపించటం కన్నీరు పెట్టించింది.
Also Read:https://teluguprabha.net/crime-news/chevella-incident-including-mother-and-3-month-old-baby/
ఎంత కష్టమైనా సరే నా చెల్లిని చదివిస్తా: మాయమ్మ, మా నాయిన సచ్చిపోయిండ్రని సుట్టాలందరు మా దగ్గరికి వస్తున్నారు. రేపెల్లుండి ఎవరిండ్లకు వాళ్లు వెళ్తారు. ఇంకా నేను మా చేల్లి మాత్రమే ఉండాలి. మాకింక దిక్కెవరు దేవుడా అంటూ పెద్ద అమ్మాయి శివానీ తల్లడిల్లింది. మాయమ్మతో కలిసి నేను కూడా కూలికి వెళ్లేదాన్ని అని చెప్పింది. వారం పదిరోజుల నుంచి మా అమ్మ ఆరోగ్యం బాగలేకపోవడంతో మా అమ్మమ్మను ఇంటికి పిలచామని తెలిపింది. దవాఖానాకు వెళ్లి ఆరోగ్యం బాగా చేపిచ్చుకుని వస్తమని అమ్మనాన్న వెళ్లి.. ఇక రాలేదని ఆ అమ్మయి కన్నీరు పెట్టుకుంది. ఎంత కష్టమైనా సరే నేను కూలికి పోయి మా చెల్లిని మంచిగ చదివిపిస్తా.. మా అమ్మమ్మను తోలుకొచ్చుకోని నా జతకు పండుకోబెట్టుకుంటా అంటూ చెప్పుకొచ్చింది. వికారాబాద్ జిల్లా హాజీపూర్‌కి చెందిన దంపతులు లక్ష్మి, బందెప్ప బస్సు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే వారికి ఉండటానికి చిన్న ఇల్లు తప్ప ఏ ఆస్తిపాస్తులు లేవు. దంపతుల మృతితో వారి ఇద్దరు కూతుళ్లు శివానీ, భవానీ అనాథలయ్యారు.


