చేవెళ్ళ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు బహుజన సమాజ్ పార్టీ నాయకులు తెలంగాణ భరోసా సభ వాల్ పోస్టర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంలో బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ టప్ప కృష్ణ మాట్లాడుతూ… మే 7న బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి హైదరాబాద్‌కు వస్తున్నారన్నారు. భారీ బహిరంగ సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లేదా సరూర్ నగర్ మైదానంలో సభ నిర్వహించేందుకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్టంలో టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో నెల గడిచినా దర్యాప్తులో పురోగతి లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారన్నారు. ఈ లీకేజ్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ మొహం చాటేస్తున్నారని ఆర్ ఎస్ పి మండిపడ్డారన్నారు. లీకేజీ కేసులో 18 మంది నిందితులను అరెస్టు చేసిన సిట్ అధికారులు. వారికి రాచ మర్యాదలు చేస్తూన్నారని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో పరీక్షలు రాసి రెండేళ్లు దాటినా ఫలితాలు విడుదల కాలేదన్నారు. ఈ సమస్యలపై సీఎంను కలవడానికి ప్రగతి భవన్‌లోకి విద్యార్థులకు అనుమతివ్వకపోవడం బాధాకరమన్నారు. కనీసం విద్యా శాఖ మంత్రి అయినా పట్టించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు అందరూ మాట్లాడుతూ… మే 7న జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.