ఇంట్లో నుండి బయటకు రాకుండా వర్షాలు కురుస్తున్నాయి. గ్రామాల్లో దానికి తోడు దోమలు, బయటకు వస్తే మురికాలువలలో పేరుకుపోయున్న మురుగు నీరు, ఎక్కడి చెత్త అక్కడే వదిలేసిన తీరు చూస్తే గ్రామాల్లో అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. చిగురుమామిడి మండలంలోని 17 గ్రామాల్లో ఇప్పటి వరకు దోమల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇక వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలంటు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ చేసినా, జిల్లా కలెక్టర్ హెచ్చరించినా, గ్రామాల్లో ప్రజలు సమస్యలపై విన్నవించినా పంచాయతీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
మండలంలోని సుందరగిరిలో పారిశ్యుద్ధం ప్రశ్నార్థకంగా మారింది. చినుకు రాలితే చాలు వాడలలో రోడ్లు మురుగునీటి గుంతలతో నిండిపోతున్నాయి, మురురుగు నీరు కాలనీల్లో పారుతుంది. ఎంఎల్ఎ కానీ మంత్రి కానీ లేక పెద్ద ఉన్నతస్థాయి అధికారుల పర్యటనలప్పుడు మాత్రమే పైపైకి గుప్పెడు బ్లీచింగ్ పౌడర్ చల్లి శభాష్ అనిపించుకుంటున్నారు పంచాయతీ అధికారులు. ప్రభుత్వాల నుండి పంచాయతీలకు కోట్ల రూపాయలు నిధులు కుమ్మరిస్తున్నా పల్లెల రాత మారడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతస్థాయి అధికారులు గ్రామాల్లో పారిశ్యుద్ధంపై దృష్టి పెట్టి పరిష్కార మార్గం చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ వర్షా కాలం సీజన్లో చిగురుమామిడి మండల వ్యాప్తంగా ఇప్పటికే వివిధ గ్రామాలలో ప్రమాదకరమైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి విషజ్వరాల కేసులు నమోదైనట్లు తాజా సమాచారం బయటకు వస్తుండడంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గాడి తప్పిన ప్రజా పాలన…
ప్రత్యేక పాలనలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రధానంగా రోడ్లపై చెట్లు చెత్తాచెదారం రోడ్లకు ఇరువైపులా పిచ్చి గడ్డి పెరిగిపోయి దర్శనం ఇస్తున్నాయి. మురుగునీరు ఎక్కడిక్కడ రోడ్లపై నిల్వ ఉండడంతో దుర్గంధం విరజిల్లుతుంది. మురుగునీళ్లలో ఈగలు దోమలు రాజ్యమేలుతున్నాయి. అంతర్గత రోడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి, పారిశుద్ధ్య పనులు చేయించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తంగా మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజాపాలన పడకేసిందని గ్రామాలకు వెళ్ళగానే కనబడుతోంది.
కుక్కలు కోతులు గుంపులుగా వెళ్లటం వాటి సైరవిహారం పెరగడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, వైద్య చికిత్సలు చేయించుకున్న రోగుల సంఖ్య ఎంతో తేలడం లేదు. గ్రామ పంచాయతీ కార్యాలయాలలో సంతకాలకే ప్రత్యేక అధికారులు పరిమితమా అని మండల ప్రజలు వాపోతున్నారు. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఫిబ్రవరి రెండో తారీఖు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. గెజిటెడ్ హోదా కలిగి 11 క్యాటగిరీల అధికారులకు పంచాయతీలను తహశీల్దార్, ఎంపీడీవో, డీటీ, ఎంపీఓ, ఎంఈఓ, మండల వ్యవసాయ అధికారి వ్యవసాయ వివిధ శాఖల ఏఈలను ప్రత్యేక అధికారులనుగా నియమించారు. దీంతో వారు పంచాయతీలను పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం గ్రామాలలో ఒక్కసారైనా పర్యవేక్షణ చేయడం లేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు సంతకాలకే అధికారుల వద్దకు వెళ్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నంత అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రజలు కోరుతున్నారు.