Impact of parenting on child behavior : పదిహేనేళ్ల బాలిక, సోషల్ మీడియాలో నలుగురితో స్నేహం చేసి, ఓ బిడ్డకు జన్మనిచ్చింది. క్రికెట్ బ్యాట్ కోసం, పదో తరగతి విద్యార్థి మరో బాలికను హత్య చేశాడు. ఇవి కేవలం వార్తా శీర్షికలు కావు, గాడి తప్పుతున్న బాల్యానికి, మన సమాజపు వైఫల్యానికి నిలువుటద్దాలు. పసిమనసులు ఎందుకు పెడదారి పడుతున్నాయి..? వారి తప్పటడుగులకు తొలి కారణం కుటుంబంలోని వాతావరణమేనని నిపుణులు ఎందుకు ఘోషిస్తున్నారు..? అసలు తల్లిదండ్రులుగా మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం..?
కుటుంబమే తొలి కారణం : లైంగిక వేధింపులు, చోరీలు, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న బాల నేరస్థులలో అధిక శాతం, కుటుంబ పరిస్థితుల వల్లే దారి తప్పినవారేనని పోలీసుల దర్యాప్తులో తేలుతోంది.
తల్లిదండ్రుల గొడవలు: ఇంట్లో నిరంతరం జరిగే కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అక్రమ సంబంధాలు పసిమనసులపై చెరగని గాయాన్ని మిగులుస్తున్నాయి.
పర్యవేక్షణ లోపం: ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై, చిన్న కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో, పిల్లలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. వారి కదలికలు, స్నేహాలు, భావోద్వేగాలను గమనించడంలో విఫలమవుతున్నారు.
“అమ్మ, నాన్నల ప్రేమ, పర్యవేక్షణకు దూరమైన పిల్లలు, ఆ ఆనందాన్ని, గుర్తింపును మరోచోట వెతుక్కుంటున్నారు. సోషల్ మీడియా, డ్రగ్స్, వీడియో గేమ్‌లకు సులభంగా బానిసలవుతున్నారు.”
– డాక్టర్ మమత రఘువీర్, మనస్తత్వ విశ్లేషకురాలు
తల్లిదండ్రులుగా మన బాధ్యత : పిల్లలను పెడదారి పట్టకుండా కాపాడాలంటే, తల్లిదండ్రులు కొన్ని కీలక బాధ్యతలను విస్మరించకూడదు.
సమయం (Time): పని ఒత్తిడి ఎంత ఉన్నా, ప్రతిరోజూ పిల్లల కోసం కొంత నాణ్యమైన సమయాన్ని కేటాయించాలి. వారి దినచర్య గురించి, స్నేహితుల గురించి, ఇష్టాయిష్టాల గురించి అడిగి తెలుసుకోవాలి.
శ్రద్ధ (Attention): పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు.. సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు..? వారి ప్రవర్తనలో ఏవైనా మార్పులు వస్తున్నాయా..? అనే విషయాలను నిశితంగా గమనించాలి. వారి ఆసక్తిని గుర్తించి, సరైన మార్గంలో ప్రోత్సహించాలి.
ప్రేమ (Love): భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటం, ఇంట్లో ప్రేమపూర్వక వాతావరణాన్ని కల్పించడం చాలా ముఖ్యం. పిల్లలు తమ సమస్యలను భయం లేకుండా మీతో పంచుకునే స్వేచ్-ఛను, భరోసాను ఇవ్వాలి.
“ఎంత పని ఒత్తిడి ఉన్నా, బిడ్డల భావోద్వేగాలు, కదలికలు, అలవాట్లను తల్లిదండ్రులు పర్యవేక్షించాలి.”
– డాక్టర్ లావణ్య నాయక్ జాదవ్, డీసీపీ, హైదరాబాద్ నగర మహిళా భద్రత విభాగం
పిల్లలు అడిగిందల్లా కొనివ్వడం ప్రేమ కాదు. వారికి సరైన మార్గనిర్దేశం చేస్తూ, వారి మానసిక ఆరోగ్యానికి భరోసా ఇవ్వడమే నిజమైన ప్రేమ. మన పిల్లల భవిష్యత్తు, మన చేతుల్లోనే ఉందని తల్లిదండ్రులు గుర్తించాలి.


