Saturday, November 15, 2025
HomeతెలంగాణChild abuse : మనసుతో విందాం.. పసిమొగ్గలకు అండగా నిలుద్దాం!

Child abuse : మనసుతో విందాం.. పసిమొగ్గలకు అండగా నిలుద్దాం!

Child abuse prevention education : విద్యాలయం ఓ దేవాలయం అంటారు.. కానీ అదే కోవెలలో కీచక పర్వాలు చోటుచేసుకుంటే? విద్యాబుద్ధులు నేర్పి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే దారి తప్పితే? అభంశుభం తెలియని పసిమొగ్గలపై లైంగిక వేధింపుల మహమ్మారి పంజా విసురుతుంటే, రేపటి తరం భవిష్యత్తేంటి? ఇటీవల తెలంగాణలోని పలు విద్యాసంస్థల్లో వెలుగు చూస్తున్న ఘటనలు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనలోకి నెడుతున్నాయి. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడం ఎలా? మన పిల్లలకు రక్షణ కవచంగా నిలవాలంటే ఏం చేయాలి?

- Advertisement -

గాడి తప్పుతున్న గురుకులాలు : ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు, మార్గనిర్దేశం చేయాల్సిన సీనియర్లలో కొందరు వికృత చేష్టలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
నర్సాపూర్‌(జి )విద్యార్థినులను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలతో ఓ ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాసర: ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఖానాపూర్‌: హాస్టల్‌లో ఉండే ఓ విద్యార్థి తన జూనియర్‌ను లైంగికంగా వేధించడం కలకలం రేపింది.

ఆ ఒక్క పాఠం.. ప్రతి తల్లి చెప్పాలి : “పిల్లలూ.. మీ ఛాతీ మీద, నడుము కింద, రెండు కాళ్ల మధ్య.. ఈ మూడు చోట్ల ఎవరైనా తాకితే.. అది మీ స్నేహితులైనా, ఇంట్లోవాళ్లైనా, బడిలో గుడిలో చివరికి కన్నతండ్రి అయినా సరే.. వెంటనే ఆ విషయం అమ్మకు చెప్పాలి.” ఓ సినిమాలో కథానాయకుడు చెప్పే ఈ మాటలు అక్షర సత్యాలు. ప్రతి తల్లి తన బిడ్డకు నిత్యం నేర్పించాల్సిన ఆత్మరక్షణ పాఠమిది. గుడ్ టచ్ (మంచి స్పర్శ), బ్యాడ్ టచ్ (చెడు స్పర్శ) మధ్య తేడాను పిల్లలకు స్పష్టంగా, అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత ప్రతీ తల్లిదండ్రులపై ఉంది.

తల్లిదండ్రులూ.. మీరే మొదటి రక్షకులు : పిల్లలను మంచి బడిలో చేర్పించడంతోనే మీ బాధ్యత తీరిపోదు. వారి ప్రవర్తనను నిత్యం గమనిస్తూ ఉండాలి.
స్నేహపూర్వక వాతావరణం: పిల్లలు మీతో ఏ విషయాన్నైనా భయం లేకుండా పంచుకునే స్వేచ్ఛను ఇంట్లో కల్పించండి.
మనసుతో వినండి: పాఠశాల నుంచి రాగానే ఆ రోజు విశేషాలు అడిగి తెలుసుకోండి. వారు చెప్పేది శ్రద్ధగా, మనసు పెట్టి వినండి. వారి మాటల్లోని ఆందోళనను, భయాన్ని పసిగట్టండి.
ధైర్యం నింపండి: వారి ప్రవర్తనలో ఏమాత్రం తేడా కనిపించినా, ప్రేమగా దగ్గరకు తీసుకుని ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. “మేమున్నాం” అనే ధైర్యాన్ని వారిలో నింపండి.

పాఠశాలలు, అధికారుల కర్తవ్యం  : కేవలం అవగాహన సదస్సు నిర్వహించి చేతులు దులుపుకుంటే సరిపోదు. “దేవాలయాలుగా భావించే విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత హేయం. ప్రతి పాఠశాలలో కౌన్సిలింగ్, హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేసి, విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని అందించాలి. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి,” అని నిర్మల్ జిల్లా తపస్ అధ్యక్షుడు శశిరాజ్ డిమాండ్ చేస్తున్నారు.

ఏఎస్పీ అవినాశ్‌కుమార్ మాట్లాడుతూ, “లైంగిక వేధింపులకు సంబంధించి ఏ చిన్న సంఘటన జరిగినా, ఆలస్యం చేయకుండా కుటుంబసభ్యులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలి. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం,” అని భరోసా ఇచ్చారు. పిల్లల భద్రత కేవలం కుటుంబానికో, పాఠశాలకో పరిమితమైన విషయం కాదు. ఇది సమాజం సమిష్టిగా చేపట్టాల్సిన యజ్ఞం. వారి మౌనాన్ని మనసుతో అర్థం చేసుకున్నప్పుడే, పసిమొగ్గల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయగలం.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad