Child safety tips for parents : “అమ్మా, చాక్లెట్ ఇస్తానంటున్నారు, వెళ్లొచ్చా?” – మీ పిల్లలు ఎప్పుడైనా ఇలా అడిగారా? అమాయకంగా వారు వేసే ఈ ప్రశ్నకు మీ సమాధానం, వారి భద్రతను నిర్దేశిస్తుంది. ఏబీసీడీలు, రైమ్స్ నేర్పినంత శ్రద్ధగా, అపరిచితుల పట్ల ఎలా మెలగాలో, వారిచ్చే ప్రలోభాలకు ఎలా దూరంగా ఉండాలో మనం మన పిల్లలకు నేర్పుతున్నామా..? పిల్లల ప్రపంచంలో అందరూ మంచివారే. ఈ అమాయకత్వాన్నే ఆసరాగా చేసుకుని, కిడ్నాప్‌లు, లైంగిక దాడులకు పాల్పడే మృగాళ్ల నుంచి మన చిన్నారులను ఎలా కాపాడుకోవాలి..?
అపాయాన్ని పసిగట్టేదెలా : పిల్లలు సున్నిత మనస్కులు. మంచి, చెడుల మధ్య తేడాను త్వరగా గుర్తించలేరు. అందుకే, కొన్ని కీలకమైన భద్రతా నియమాలను వారికి చిన్నప్పటి నుంచే నేర్పించడం తల్లిదండ్రులుగా మన ప్రథమ కర్తవ్యం.
‘నమ్మకమైన’ వలయాన్ని గీయండి: కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, మీరు విశ్వసించే ఇరుగుపొరుగు వారిని పిల్లలకు స్పష్టంగా పరిచయం చేయండి. “ఈ ‘సేఫ్ సర్కిల్’లో ఉన్నవారు తప్ప, మరెవరైనా ఎంత బతిమాలినా, బలవంతం చేసినా, వారితో వెళ్లకూడదు” అని గట్టిగా చెప్పండి.
‘లిఫ్ట్’ ఇస్తానంటే.. ‘వద్దు’ అని చెప్పమనండి: గుర్తుతెలియని వ్యక్తులు ‘లిఫ్ట్’ ఇస్తామన్నా, ‘అడ్రస్ చూపిస్తా రా’ అని పిలిచినా, ‘మీ కుక్కపిల్ల ఇటు వచ్చింది’ అని నమ్మించినా, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని హెచ్చరించండి.
చాక్లెట్లు, బొమ్మల ఎర.. వెనుక ఉన్న వల : పిల్లలు ఒంటరిగా తిరిగే సమయాన్ని గమనించి, కొందరు దుండగులు చాక్లెట్లు, బొమ్మలు ఆశచూపి వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తారని వివరించండి. అలాంటి వారి ఉచ్చులో పడితే ప్రమాదమని అర్థమయ్యేలా చెప్పండి.
ఇంటి గుట్టు.. బయటపెట్టొద్దు : కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, ఇంట్లోని విలువైన వస్తువులు, ఏటీఎం పాస్‌వర్డ్‌ల వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరితోనూ, ఎంత నమ్మకమైన వారిలా కనిపించినా పంచుకోవద్దని చెప్పండి.
డిజిటల్ అపరిచితులూ ప్రమాదమే : ఆన్‌లైన్ గేమ్‌లలో, సోషల్ మీడియాలో పరిచయమయ్యే అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, ప్రైవేట్ బ్రౌజింగ్ ప్రాముఖ్యతను వివరించండి.
తల్లిదండ్రులుగా మన బాధ్యత..
మనసు విప్పి మాట్లాడించండి: పిల్లలు తమ భయాలను, ఇబ్బందులను మీతో స్వేచ్-ఛగా పంచుకునే వాతావరణాన్ని ఇంట్లో కల్పించండి. రోజూ స్కూల్లో, ట్యూషన్‌లో జరిగిన విషయాలను ఓపికగా అడిగి తెలుసుకోండి.
అడ్రస్, ఫోన్ నంబర్లు: తల్లిదండ్రుల పేర్లు, పూర్తి ఇంటి చిరునామా, కనీసం ఒక ఫోన్ నంబర్‌ను పిల్లల చేత కంఠస్థా పట్టించండి. వారి స్కూల్ బ్యాగ్‌లో లేదా ఐడీ కార్డు వెనుక ఈ వివరాలు రాసి ఉంచండి.
గట్టిగా అరవమని చెప్పండి: ఎవరైనా అపరిచితులు బలవంతం చేస్తే, “Help! He is not my father!” (సహాయం చేయండి! ఇతను మా నాన్న కాదు!) అని గట్టిగా అరవాలని నేర్పించండి. పిల్లల భద్రత కేవలం పాఠశాలల, పోలీసుల బాధ్యత మాత్రమే కాదు. మన కంటికి రెప్పలా మనమే వారిని కాపాడుకోవాలి.


