CM KCR: సీఎం కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జగిత్యాల జిల్లాలోని మోతెలో ఏర్పాటు చేసిన టీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కొండగుట్ట అంజన్నకు వరాల జల్లు కురిపించారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఆధ్యాత్మిక పరిమళాలు ఉన్న ప్రాంతం. కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు అంజన్న దేవాలయంతో పాటు పలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. కొండగట్టు అంజన్న సన్నిధికి హనుమాన్ భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. అంజన్న దేవస్థానం కేవలం 20 ఎకరాల్లో మాత్రమే ఉండేది. 384 ఎకరాల స్థలాన్ని దేవాలయానికి ఇచ్చాం. 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉంది. కొండగట్టు అంజన్న క్షేత్రానికి రూ. 100కోట్లు మంజూరు చేస్తున్నాం. త్వరలోనే నేను స్వయంగా వచ్చి ఆగమశాస్త్ర ప్రకారం భారతదేశంలో సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తానని కేసీఆర్ అన్నారు.
సమైక్య ఏపీలో తెలంగాణలో గోదావరి పుష్కరాలు జరిపేవారు కాదు. తెలంగాణ సాధించి గోదావరి పుష్కరాలు జరుపుతామని ధర్మపురిలో మొక్కుకున్నానని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాధించుకున్నాక గోదావరి పుష్కరాలు ఘనంగా జరుపుకుంటున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణోళ్లకు తెలివిలేదన్నారు. వాళ్ల నోరు మూతలుపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. రైతు బంధుకు పరిమితి లేకపోవటాన్ని తప్పుపడుతున్నారు. రాష్ట్రంలో 93.5శాతం మంది రైతులు ఐదెకరాలలోపు భూమి ఉన్నవారే. 5 నుంచి 10 ఎకరాలలోపు ఉన్నవారు 5 శాతం,10 ఎకరాలకుపైగా ఉన్న రైతులు ఒకశాతం మాత్రమే ఉన్నారని కేసీఆర్ అన్నారు. 20 ఎకరాలు పైగా ఉన్న రైతులు 0.28శాతం మాత్రమే ఉన్నారని సీఎం తెలిపారు.
పింఛన్ల విషయంలో వృద్ధుల ధీమాచూస్తే సంతోషం కలుగుతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెరాస విధానాల వల్ల అన్నివర్గాల ప్రజల్లో ధీమా నెలకొంది. గ్రామాల్లోనే ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మిషన్ భగీరథ పైపులు 2లక్షల కి.మీ మేర ఉన్నాయి. రాష్ట్రంలో 40వేల ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. కరెంట్ అవసరం లేకుండానే గ్రావిటీ ద్వారా మిషన్ భగీరథ జలాలు ప్రతీ ఇంటికి చేరుతున్నాయని అన్నారు. పాలకులు, అధికారుల అంకిత భావం వల్లే ఇన్ని విజయాలు సాధించామని కేసీఆర్ గుర్తు చేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ఎన్నో పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. గురుకుల విద్యాలయాల్లో తెలంగాణకు పోటీయే లేదు. కేంద్రం సహకరించకున్నా 33 జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.