Friday, November 22, 2024
Homeతెలంగాణఅసెంబ్లీ వేదికగా కేసీఆర్ నయా పోరాటం, కేంద్రం వివక్షను ప్రజలకు వివరించేందుకు అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ వేదికగా కేసీఆర్ నయా పోరాటం, కేంద్రం వివక్షను ప్రజలకు వివరించేందుకు అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలతో రాష్ట్ర ఆదాయనికి భారీగా గండి పడుతోందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సమకూరాల్సిన రూ.40,000 కోట్లకు గండి పడటంపై దృష్టినిలిపిన తెలంగాణ సీఎం ఈమేరకు రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు వివరించేందుకు అసెంబ్లీ సమావేశాలే వేదికగా సిద్ధమయ్యారు. అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రం పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల భారాన్ని ఎలా విధిస్తోందో, ఇందుకు రాజకీయ కారణాలే కారణమంటూ సభాముఖంగా వివరించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.

- Advertisement -

2022 -23 ఆర్థిక సంవత్సరానికి గండి
తెలంగాణ కు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల భారం 2022 -23 ఆర్థిక సంవత్సరానికి చోటుచేసుకోవటాన్ని కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇటువంటి చర్యలతో తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తున్నదంటూ తెలంగాణ ప్రజలందరికీ సవివరంగా తెలియజెప్పేందుకు వచ్చేనెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డిని చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. వారం రోజులపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై లోతైన చర్చను చేపట్టేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన గణాంకాలు, ఉదాహరణలతో సహా వివరించేందుకు ఆర్థికశాఖ ఇప్పటికే సిద్ధమైందని సమాచారం.

రాష్ట్ర భవిష్యత్తుకే ఆటంకం
కేంద్రం అనుసరిస్తున్నఅసంబద్ధ ఆర్థిక విధానాల ద్వారా రాష్ట్రాల భవిష్యత్తుకు, ప్రగతికి ఆటంకంగా మారిందని కేసీఆర్ బలంగా భావిస్తున్నారు. ప్రతీ ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదల చేసే బడ్జెట్ గణాంకాలను అనుసరించి రాష్ట్రాలు తమ తమ బడ్జెట్ ను రూపొందించుకుంటాయి. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రతి రాష్ట్రానికి ఆనవాయితీగా ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితులను ముందస్తుగా కేంద్రం వెల్లడిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తెలంగాణకు ఇచ్చే ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితిని 54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. దీనిని అనుసరించి తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ను రూపొందించుకున్నది. కాగా, కేంద్రం అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్ర ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితిని 39 వేల కోట్లకు కుదించింది. తద్వారా రాష్ట్రానికి అందాల్సిన 15 వేల కోట్ల నిధులు తగ్గాయి. అంతే కాకుండా ఆర్థికంగా పటిష్టంగా వున్న రాష్ట్రాలకు అదనంగా 0.5 శాతం నిధుల సేకరణకు ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితి ఉంటుంది. ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ సౌలభ్యాన్ని కూడా పొందనీయకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తామంటెనే 0.5 శాతం రుణ పరిమితికి అనుమతిస్తామనే వ్యవసాయ వ్యతిరేక రైతాంగ వ్యతిరేక నిబంధనను ముందుకు తెచ్చి బలవంత పెట్టిందని కేసీఆర్ సర్కారు ఆరోపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News