CM KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బుధవారం జగిత్యాలలో పర్యటించారు. వాయుమార్గంలో మధ్యాహ్నం 1.31 గంటలకు జగిత్యాల పట్టణానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా ఘనంగా స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1.42 గంటలకు మొదట నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా కార్యాలయంలో గులాబీ జెండాను ఎగురవేశారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లాశాఖ అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును ఆయన సీట్లో స్వయంగా కూర్చుండబెట్టి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాలలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం మధ్యాహ్నం 2.04 గంటలకు శంకుస్థాపన చేసి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు జగిత్యాల సమీకృత కలెక్టరేట్ వద్దకు సీఎం కేసీఆర్ చేరుకోగానే అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం 2.21 గంటలకు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్‌లోని ఉచితాసనంలో కలెక్టర్ జి.రవి నాయక్ ను స్వయంగా కూర్చుండబెట్టిన సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారి ప్రసంగం – ముఖ్యాంశాలు :
• ఉద్యమ ప్రస్థానంలో మా తెలంగాణ మాకు కావాలె అని మనమంతా కొట్లాడినం
• తెలంగాణ వస్తే ధనిక రాష్ట్రం అవుతుందని నేను అపుడే చెప్పిన. అది నిజమైంది.
• తెలంగాణలో ప్రతివారికీ మేలు జరిగేలా సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చుకుంటున్నం
• తెలంగాణలో అద్భుతమైన విజయాలను మనం సాధించుకున్నం. ఉద్యోగులందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైంది
• రాష్ట్రం ఏర్పడిన నాడు మనది అనిశ్చితమైన స్థితి ఉండేది. కరంటు రాదు, నీళ్లు లేవు, వలసలు పోయేవారు.
• కానీ, నేడు ఎంతో అభివృద్ధి జరిగింది. వ్యవసాయానికి దేశంలోనే 24 గంటలూ కరెంటు ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే.
• తెలంగాణ వచ్చిన నాడు మనది 62 వేల కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే. ఈసారి మనం ఖచ్చితంగా 2 లక్షల 20 వేల కోట్లకు చేరుకుంటం.
• అన్నిరంగాల్లో మనం దేశంలోనే నంబర్ వన్ గా నిలిచినమంటే ప్రజా ప్రతినిధులు, ఉద్యోగుల సమిష్టి కృషి, సహకారమే కారణం.
• ఇవాళ తెలంగాణ ఉన్నతస్థాయికి చేరుకోవడానికి అందరం కష్టపడటమే కారణం.
• గురుకుల విద్యలో మనకు మనమే పోటీ, ఇండియాలోనే మనకు పోటీ లేదు
• కేంద్రం సహకరించకున్నా మనం 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు కట్టుకుంటున్నం.
• ఆసరా పెన్షన్లు ఇస్తే అవసరాలు తీరేలా ఉండాలని నేనే ఈ నిర్ణయం తీసుకున్న
• ‘‘ మా కొడుకులు సూడకపోతే చెర్లల్ల బాయిలల్ల పడి సచ్చిపోతా వుంటిమి. ఇపుడు ఠంఛనుగా నెలకు 2016 పెన్షన్ వస్తున్నది’’ అని పెద్దోళ్లు దీవిస్తున్నరు.
• ఇట్లాంటి దీవెనలకన్నా ఒక పరిపాలకుడికి కావలసిన సంతృప్తి ఇంకేమున్నది?
• తెలంగాణ పల్లెల్లోకి పంపిణీ చేస్తున్న లక్షల రూపాయలతో పల్లెల్లో పరపతి పెరిగింది అని ఆర్ధికవేత్తలు అంటున్నరు.
• రాష్ట్రంలో పండే మొత్తం ధాన్యాన్ని కొంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమే
• ఐదేండ్లలోపు మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నీళ్లిస్తం, లేకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం అని ఎంతో ధైర్యం చెప్పిన.
• ఆ మాట నిలబెట్టుకొని చేసి చూపించిన.
• ఇపుడు దాదాపు 40 వేల ఓవర్ హెడ్ ట్యాంకులున్నయి. 19 ఇంటేక్ వెల్స్ నుంచి నీళ్లు తీసుకొని శుద్ధి చేసి ఈ ట్యాంకుల కంటే ఎక్కువ ఎత్తుకు పంపి గ్రావిటీ ద్వారా సరఫరా చేస్తరు.
• ఇట్లా అన్ని రంగాల్లో మేధో మధనం చేయడం వల్లనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నది.
• ఆనాడు అడవుల్లో అభివృద్ధే లేదు. నేడు హరితహారంతో ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్నం.
• తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నది. దాన్ని అందిపుచ్చుకునే దశకు మనం చేరుకున్నం.
• మరింత కమిట్ మెంటుతో మనం కృషి కొనసాగిస్తే, గొప్పగా ముందుకు పోతం.