నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిని ఫుడ్ పాయిజన్ (Food Poison) కావడంతో విద్యార్థినీ, విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు దారి తీసిన కారణాలపై వెంటనే విచారణ జరిపి, తనకు నివేదికను అందజేయాలని సీఎంవో అధికారులను సీఎం ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.