CM review on Cyclone Montha Effect: మొంథా తుపాను ప్రభావంలో తెలంగాణలో వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. బుధవారం కురిసిన వర్షంతో పలు జిల్లాలు నీటమునిగాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు తెగిపోయి ప్రయాణాలు స్తంభించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షంతో జంట నగరాలు నీట మునిగాయి. మంగళవారం రాత్రి కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గర తీరం దాటిన తుపాను.. అనూహ్యంగా తెలంగాణవైపు దిశ మార్చుకోవడంతో తెలంగాణలో జనజీవనం స్తంభించిపోయింది. వాతావరణ శాఖ అధికారుల అంచనాల ప్రకారం మొంథా తుపాను ఉత్తరాంధ్ర, తెలంగాణ సరిహద్దుల మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వైపు కదులుతోంది. దీంతో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఇవాళ ఉదయం 11 సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
8 జిల్లాలకు రెడ్ అలర్ట్: గురువారం సాయంత్రానికి వాయుగుండం పూర్తిగా బలహీనపడే అవకాశాలు ఉన్నప్పటికీ.. వాతావరణశాఖ తాజాగా 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్టుగా వాతావరణ అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో ఖమ్మం- మహబూబాబాద్ జిల్లాల మధ్య వాల్యాతండా సమీపంలోని వంతెనకు ఆనుకుని ఆకేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో బుధవారం సాయంత్రం నుంచి రెండు జిల్లాల మధ్య అధికారులు రాకపోకలు నిలిపివేశారు.
భీమదేవరపల్లిలో వర్ష బీభత్సం: బుధవారం సాయంత్రానికి కొంత బలహీనపడిన తుపాను వాయుగుండంగా మారింది. గురువారం సాయంత్రానికి వాయుగుండం పూర్తిగా బలహీనపడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలకు పలు జిల్లాల్లో వరి పంట వేలాది ఎకరాల్లో నేలకొరిగింది. వరిపంట కోసి ధాన్యాన్ని ఎండపెట్టిన రైతుల బాధ ఇక వర్ణనాతీతం. పత్తి, మక్కలు నీట మునగడంతో రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రైల్వేస్టేషన్లు నీటమునిగాయి. దీంతో పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. హనుమకొండ బస్టాండ్లలోకి నీరు చేరడంతో బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో హనుకొండ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం 79819 75495 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని స్థానికులకు సూచించారు. రికార్డు స్థాయిలో హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెం.మీల వర్షాపాతం నమోదైంది.


