CM Revanth Visit Flood Areas: తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రాంతాలను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే చేశారు. ఆయన వెంట ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, సిర్సిల్లా జిల్లాల్లో వరద ప్రభావాన్ని పరిశీలించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ముంపు ప్రాంతాలను సీఎం స్వయంగా పరిశీలించారు. గోదావరి జలాలకు ఎల్లంపల్లి జంక్షన్‌లా పనిచేస్తుందని, దీని నిర్వహణలో లోపాలు ఉన్నాయని రేవంత్ వ్యాఖ్యానించారు.
ALSO READ: RCB: మూడు నెలల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఆర్సీబీ..విషయం ఏంటంటే..!
సీఎం రేవంత్, కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఒకే సాంకేతికతతో నిర్మితమై, ఒకే రకమైన లోపాలతో ఉన్నాయని తెలిపారు. “డిజైన్, నిర్మాణం, నిర్వహణలో సమస్యలు ఉన్నాయి. కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం” అని సీఎం పేర్కొన్నారు. కాసేపట్లో కామారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి, రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను వేగవంతం చేయాలని ఆదేశించనున్నారు.
కామారెడ్డిలో 418.3 మి.మీ. వర్షపాతంతో అరగొండ తీవ్రంగా ముంపునకు గురైంది. 500 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. NDRF, SDRF, ఆర్మీ బృందాలు రెస్క్యూ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయి. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఎల్లంపల్లి వద్ద నీటి మట్టాలు, రిజర్వాయర్ సామర్థ్యాన్ని సీఎం సమీక్షించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆహారం, వైద్య సహాయం అందించడంపై దృష్టి సారించారు.


