“బ్రహ్మ కుమారీస్ – శాంతి సరోవర్” ద్వి దశాబ్ది కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇరవై ఏళ్లలో గచ్చిబౌలి పెద్ద నగరంగా అభివృద్ధి చెందిందని, ఈ ప్రాంతంలో శాంతి సరోవర్ ఉండటం సంతోషమన్నారు సీఎం రేవంత్. బ్రహ్మకుమారీస్ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళుతోందని, డ్రగ్స్ పదం వింటేనే భయపడేలా డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్స్ టీమ్ ను ఏర్పాటు చేశామన్నారు సీఎం.
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం-రైతు ప్రభుత్వమని ఆయన చెప్పుకొచ్చారు. రైతు రుణమాఫీ చేసి మాది రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్నామని, దేశంలో ఎక్కడలేని విధంగా ఎనిమిది నెలల్లోనే రూ.31 వేల కోట్లు రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మాదేనంటూ రేవంత్ రెడ్డి వివరించారు.
యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్ యూనివర్సిటీనీ ప్రారంభించుకున్నామని, ముచ్చెర్లలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, అందుకే అక్కడే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. బ్రహ్మకుమారీస్ తెలంగాణ ప్రభుత్వానికి మార్గదర్శులని, శాంతి సరోవర్ కు మా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
శాంతి సరోవర్ లీజ్ రెన్యూవల్ చేసి వారికి అన్నివిధాలా సహకరిస్తామని, మౌంట్ అబూ తర్వాత తెలంగాణలో శాంతి సరోవర్ ఉండటం మనకు ఎంతో గర్వకారణమని సీఎం రేవంత్ అన్నారు.
గచ్చిబౌలిలోని “బ్రహ్మ కుమారీస్ – శాంతి సరోవర్” ద్విదశాబ్ది కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.