CM Revanth Family | సీఎం ఫ్యామిలీ సర్వే పూర్తిరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సర్వే సిబ్బంది గురువారం వివరాలు సేకరించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇంలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి సీఎం రేవంత్ కుటుంబ సభ్యుల (CM Revanth Family) వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సర్వే పై ప్రజల అభిప్రాయం ఏముంది? ప్రజలు ఏమంటున్నారు? అంటూ ఆరా తీశారు.
సర్వే జరుగుతున్న తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. వీలైనంత త్వరగా అధికారులు కుల సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, అందుకు కావల్సిన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.