ప్రభుత్వానికి కళ్లు, చెవులు కలెక్టర్లు. జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి కలెక్టర్లే వారధులు-సారథులు కూడా. సమర్థులైన యువ కలెక్టర్లను నియమించాం. రాజకీయ ఒత్తిడులు, ఎలాంటి రాగద్వేషాలు లేకుండా కలెక్టర్ల బదిలీలు చేశారు.
విధి నిర్వహణలో కేవలం తెలంగాణ భాష నేర్చుకుంటే సరిపోదు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం కావాలి, రాష్ట్రాన్ని సొంత రాష్ట్రంగా భావించి ప్రజలతో మమేకమై ప్రజా ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోండి.
శంకరన్, శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ ఐఏఎస్ లను గుర్తు పెట్టుకునేలా మీ పనితీరుండాలి. ఏసీ గదులకు పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకుని ప్రతి పనిని నిర్వహించండి. పాఠశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రులు పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు స్వయంగా తీసుకోవాలి.
గతంలో పది పెద్ద జిల్లాలుండేవి, అప్పుడు 10 మందే కలెక్టర్లు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా నడిపించారు ఇప్పుడు చూస్తే జిల్లాల పరిధి తగ్గి, కలెక్టర్ల సంఖ్య పెరిగింది. బాధ్యతల్లో తేడా ఏమీ లేదు. అప్పుడు 10 మంది చేసే పనిని ఇప్పుడు 33 మంది చేస్తున్నారు. ఎవరికి వారుగా మీ పనితీరును, సమర్థతను చాటుకునే బాధ్యత మీమీదే ఉంది.
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో పారదర్శకంగా వ్యవహరించి ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచండి. జిల్లాల్లోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. అవసరమైతే జియో ట్యాగింగ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేసి నిఘా ఉంచాలి.
గిరిజన ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకు అవసరమైతే స్థానికంగా ఉండే స్వచ్ఛందసంస్థల సహకారం, పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులతో పాటు వ్యాపార వాణిజ్యవేత్తల భాగస్వామ్యం తీసుకుని మెరుగైన సేవలు అందించేలా కృషి చేయండి.