మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం రేవంత్, వ్యక్తిగతంగా తాను చాలా అభిమానించే నాయకుల్లో దేవేందర్ గౌడ్ అగ్రస్థానంలో ఉంటారని అన్నారు. పుస్తకంలో దేవేందర్ గౌడ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ను ప్రజల కోణంలో పొందుపర్చారని, కొంత మంది తెలంగాణ ఉద్యమ చరిత్ర ను తమకనుకూలంగా మలుచుకున్నారని రేవంత్ ఆరోపించారు.

ఉద్యమ చరిత్రలో ఒక కుటుంబం కాదు
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువకుల త్యాగాలను చరిత్రలో లిఖించాలని, ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీనే తెలంగాణ అని చరిత్రలో రాసే ప్రయత్నం చేశారని సీఎం ఆరోపించారు. తెలంగాణ కోసం దేవేందర్ గౌడ్ ఆ నాడు తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని, ఆ నాడు ఆయన ఉన్న పార్టీలో నాయకుడి తర్వాత సరిసమానంగా చలామణి అయిన నేత దేవేందర్ గౌడ్ అంటూ గుర్తుచేశారు. మంచి జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ కోసం బయటకు వచ్చారన్నారు రేవంత్.

టీజీ అని రాయించిన
గోదావరి జలాలతోనే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని దేవేందర్ గౌడ్ ఆ నాడు పాదయాత్ర చేశారని, దేవేందర్ గౌడ్ పాదయాత్ర వల్లనే ఆ నాటి పాలకులు చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టును చేపట్టారన్నారు సీఎం రేవంత్. తెలంగాణ అంటే టీజీ అని ఉద్యమంలో యువకులు బండ్ల పైనే కాదు గుండెల పైన రాసుకున్నారని, దేవేందర్ గౌడ్ ఆ నాడు గోడలపైన టీజీ అని రాయించారన్నారు. అందుకే ప్రజల ఆకాంక్ష మేరకు తమ ప్రభుత్వం రాగానే టీఎస్ ను టీజీగా మార్చినట్టు వివరించారు. దేవేందర్ గౌడ్ లాంటి వారు క్రియాశీలక రాజకీయాల్లో లేకపోవడం తెలంగాణకు తీరని నష్టమని, తెలంగాణ రాజకీయాల్లో విలువలతో కూడిన నాయకులు రావాలని ముఖ్యమంత్రి అన్నారు.

