CM Revanth meet Mallikarjun Kharge: ఇటీవల అస్వస్థతకు గురైన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. సోమవారం సాయంత్రం కర్ణాటకకు వెళ్లిన సీఎం బెంగళూరులోని ఖర్గే నివాసంలో కలిశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మల్లికార్జున ఖర్గే బెంగళూరులోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలోనే మల్లికార్జున్ ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు.
పలు కీలక అంశాలపై చర్చ: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి కలిసిన సదర్భంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి చర్చించారు. అంతే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై తీవ్రంగా మంతనాలు జరిగినట్లు సమాచారం. ఇదీ అంశంపై సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి సైతం చర్చించినట్టుగా తెలుస్తుంది.
ఎక్స్ వేదికగా వెల్లడి: ఖర్గేను కలిసిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ వేదికగా తెలిపారు. “ఇటీవల అనారోగ్యానికి గురై పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ చికిత్స చేయించుకుని.. బెంగుళూరులో విశ్రాంతి తీసుకుంటున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గేను పరామర్శించాను. ఆయన త్వరగా కోలుకుని, తిరిగి ప్రజా జీవితంలో క్రియాశీలకంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” అంటూ రేవంత్ రెడ్డి తన ఎక్స్‌లో పేర్కొన్నారు.


