Jubilee Hills by-election campaign: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నువ్వానేనా అన్నట్లుగా ప్రచారాన్ని ప్రారంభించాయి. బీజేపీ సైతం.. తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. బీఆర్ఎస్ తరపున రంగంలోకి దిగిన కేటీఆర్, హరీశ్ రావు ప్రచారాన్ని మరింత రక్తి కట్టిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రత్యక్షంగా రంగంలోకి దిగనున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం హోరెత్తనుంది.
రంగంలోకి దిగనున్న సీఎం రేవంత్ రెడ్డి: ఈనెల 30 నుంచి నాలుగు రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించేలా అధికారపార్టీ ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలో అధిక సంఖ్యలో ఉన్న సినీకార్మికులతో భారీసభ ఏర్పాటు చేయాలని హస్తం పార్టీ నిర్ణయించింది. ఈనెల 28న పోలీస్ గ్రౌండ్ లో సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యే అవకాశం ఉంది. సినీరంగ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేలా గతంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్మాతలు, సినీ ప్రముఖులను కూర్చోబెట్టి ఒప్పించిన విషయం తెలిసిందే. దీంతో అధికార పార్టీపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని బహిరంగ సభ ద్వారా.. సీఎం రేవంత్ రెడ్డి వారికి విజ్ఞప్తి చేయనున్నాట్టుగా తెలుస్తోంది. సినీ కార్మికులు, ఆ నేపథ్యం కలిగిన వారి ఓట్లు ఈనియోజకవర్గంలో పది వేలకు పైగానే ఉంటాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో వారితో సభ నిర్వహించడం ద్వారా భారీ మెజార్టీ సాధించవచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నట్టుగా సమాచారం.
అన్ని డివిజన్లను కవర్ చేసేలా సీఎం రోడ్ షో: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను కవర్ చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఈ నెల 30 నుంచి నాలుగు రోజుల పాటు ఆయన ఈ రోడ్‌షోలలో పాల్గొంటారు. ఒక్కో డివిజన్‌లో ఒకటి లేదా రెండు ప్రాంతాలలో.. సాయంత్రం వేళల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. దీని కోసం మంత్రులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 30, 31 తేదీలతో పాటుగా వచ్చే నెల 4, 5 తేదీల్లో రేవంత్ రోడ్ షోలు ఉండనున్నాయి. అవసరమైతే ముఖ్యమంత్రి మరో రోజు సైతం రోడ్‌షో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:https://teluguprabha.net/telangana-news/brs-win-in-mtar-technologies-ltd-workers-union-elections/
మరింత బాధ్యతతో పని చేసే అవకాశం: సీఎం ప్రచారం ప్రారంభమైతే ఎన్నికల ప్రచారం మరింత వేగం పుంజుకుంటుందని అధికార పార్టీ అంచనా వేస్తుంది. బాధ్యతలు అప్పగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత సీరియస్‌గా పనిచేస్తారని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులకు ఒక డివిజన్ చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఒక్కో మంత్రికి నలుగురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లను అనుబంధంగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. వీరంతా సీరియస్‌గా రంగంలోకి దిగితే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంటుందని ముఖ్య నాయకులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మరికొందరు మంత్రులు ప్రచారంలో పాల్గొననున్నారు.


